మల్లు స్వరాజ్యం మృతిపట్ల ప్రముఖుల సంతాపం

మల్లు స్వరాజ్యం మృతిపట్ల ప్రముఖుల సంతాపం

మల్లు స్వరాజ్యం మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు సీఎం. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం, గమ్యం రేపటి తరాలకు స్పూర్తిదాయకమని తెలిపారు. మల్లు స్వరాజ్యం లాంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం కేసీఆర్.

మల్లు స్వరాజ్యం మరణవార్త తీవ్రంగా బాధించిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిని కోల్పోవడం.. తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. సిద్దాంతాలు వేరయినా.. పేదల పక్షాన మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ సాయుధ పోరాటంతో పేదల పక్షాన పోరాటం చేసిన చైతన్య దీపిక మల్లుస్వరాజ్యమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్వరాజ్యం మరణం పేదలకు తీరని లోటన్నారు రేవంత్.  గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బంజారాహిల్స్ లోని కేర్  ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె.. ఇవాళ( శనివారం) తుది శ్వాస విడిచారు.