తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్​ కుటుంబమే అడ్డు

తెలంగాణ అభివృద్ధికి  కేసీఆర్​ కుటుంబమే అడ్డు

హాలియా, వెలుగు:  తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కుటుంబమే అడ్డుగా ఉందని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ యాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్​ మండలంలోని చేపూరు, కట్టవారిగూడెం, పిట్టలగూడెం, కొప్పోలు గ్రామాల మీదుగా సాగింది. గుర్రంపోడ్ లో జరిగిన కార్నర్​ మీటింగులో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఎత్తి బంగాళాఖాతంలో కలిపేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం నిరుద్యోగులకు కొలువులు ఇవ్వకుండా పేపర్ లీక్​చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ​ప్రభుత్వంలో ప్రజలకు నీళ్లు రాలేదని, బీఆర్ఎస్  ప్రజాప్రతినిధులకు మాత్రం వందల ఎకరాల ఫామ్ హౌస్ లు, వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయన్నారు. 

ఆస్తులు పెరిగి, వాళ్ల కుటుంబాలు  బంగారమయ్యాయన్నారు. ఎస్ఎల్​బీసీ టన్నెల్ పూర్తి చేయకుండా పదేండ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బుధవారం నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కుందూరు జైవీర్ రెడ్డి చేపట్టనున్న గిరిజన చైతన్య యాత్ర ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు శంకర్ నాయక్,  కుందూరు జయవీర్ రెడ్డి,  చలమల్ల క్రిష్ణారెడ్డి,  రంగినేని నర్సింహారావు, జాల సత్తయ్య, చలమల్ల రాఘవరెడ్డి, చలమల్ల జగదీశ్వర్ రెడ్డి,  వెంకటేశ్వర రెడ్డి, కమతం జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.