గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పెండింగ్!.. ఆశావహుల చూపు.. ప్రగతి భవన్ వైపు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పెండింగ్!.. ఆశావహుల చూపు.. ప్రగతి భవన్ వైపు
  • గత నెల 27తో ముగిసిన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం
  • ఖాళీ అయిన రాజేశ్వర్ రావు, ఫరూఖ్ హుస్సేన్ సీట్లు
  • ఆ స్థానాల్లో అభ్యర్థులెవరో తేల్చని సీఎం కేసీఆర్
  • ఆశావహుల చూపు.. ప్రగతి భవన్ వైపు
  • గత అనుభవాల దృష్ట్యా ఆచి తూచి అడుగులు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలెవరనేది సీఎం కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. గత నెల 27తో ఎమ్మెల్సీలు డీ రాజేశ్వర్ రావు, ఫరూఖ్ హుస్సేన్ పదవీ కాలం ముగిసింది. అంతకు ముందే  అభ్యర్థులెవరో ఖరారు చేసి రాజ్ భవన్ కు జాబితా పంపుతారని ఆశావహులు భావించారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆ అంశాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టడం గమనార్హం. ప్రస్తుతం రాజేశ్వరరావు, ఫారూఖ్​ హుస్సేన్ మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. తన పదవిని మరో మారు రెన్యూవల్ చేయాలని రాజేశ్వరరావు సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ రావు వరుసగా మూడో సారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీకి మాజీ కో ఆప్షన్ సభ్యురాలు విద్యావర్ధని కూడా క్రిస్టియన్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇదే కోటాలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పేరు కూడావినిపిస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కూడా రిటైరయ్యారు. ఆయన మరోమారు తన పదవిని రెన్యూవల్ చేయాలని అధినేతను కోరినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారిలో శ్రవణ్​ దాసోజు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్  తదితరులున్నారు. 

పెండింగ్ లో ఎందుకు పెట్టినట్టు

ఎన్నికల ఏడాది కావడంతో అభ్యర్థుల ఎంపిక అంశంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. సామాజిక వర్గాలు, గ్రూపులు, సీట్లు అడ్జెస్ట్ మెంట్లపై కేసీఆర్ క్షుణ్నంగా స్టడీ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు స్థానాల్లో డీ రాజేశ్వర్ రావు (క్రిస్టియన్), ఫరూఖ్ హుస్సేన్ (ముస్లిం) మైనార్టీలు కొనసాగుతున్నారు. తిరిగి అదే సామాజిక వర్గానికి ఇస్తారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఒకటి బీసీలకు , మరోటి దళితులకు ఇస్తారనే చర్చకూడా ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల సమయం కావడంతో కీలక సభ్యులు చేజారకుండా ఈ రెండు పదవులను వినియోగించుకునేందుకు తన అమ్ముల పొదిలో పెట్టుకుంటున్నారా..? అనే అనుమానాలున్నాయి.  

గత అనుభవాల దృష్ట్యా

గతంలో పాడి కౌశిక్  రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్ కు పంపగా ఆమె తిరస్కరించారు.  ఆ తర్వాత మాజీ స్పీకర్ మధుసూధనాచారి, కవి గోరేటి వెంకన్న పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ రిజెక్ట్ చేసినందున మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా కేసీఆర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మే 19న నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులెవరో తీర్మానం చేసి రాజ్ భవన్ కు పంపుతారనే ఆశావహులు భావించారు. కానీ ఆ ప్రస్తావన లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగిసింది. దీంతో ఉత్కంఠ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ రెండు పదవుల విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? ఎవరికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెడతారన్నది ఆసక్తికరంగా మారింది.