సీఎం కేసీఆర్ ఓ పాస్ పోర్ట్ బ్రోకర్ : బండి సంజయ్

సీఎం కేసీఆర్ ఓ పాస్ పోర్ట్ బ్రోకర్ : బండి సంజయ్
  • బీజేపీ గెలిస్తే మియాపూర్– సంగారెడ్డి మెట్రో లైన్
  • పటాన్ చెరు సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

పటాన్ చెరు: సీఎం కేసీఆర్ పగలుకు దారుస్సాలం.. రాత్రికి దారుకు సలాం అంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్‌ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితాయన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బండి సంజయ్ మాట్లాడుతూ.. మసీదుకుపోయిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదని అన్నారు. కనీసం అల్లా గురిం చే వాళ్లకు తెలియదని చెప్పారు. టోపీ పెట్టుకొని రాముడిని, సీతనే మొక్కుతున్నారని ఆరోపించారు. మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లిం సమాజం వాళ్లకు ఓట్లు వేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఒక పాస్పోర్ట్ బ్రోకర్.. అలాంటి వ్యక్తిని అల్లాతో పోలుస్తారా? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా? కేటీఆర్ చెప్పాలని అన్నారు. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.

ఎన్నికలు రాగానే కేసీఆర్ కు రామ జన్మభూమి గుర్తుకొస్తుందన్నారు. అవును తాను కర సేవలో పాల్గొన్నానని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ అవసరం అనుకుంటే రామాయణాన్ని మార్చి అయోధ్యలో రాముడు పుట్టలేదని తిరిగి చరిత్ర రాస్తాడని అన్నారు. బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేస్తామన్నారు. మెట్రో ఇచ్చేదే ప్రధాని మోదీ అని అన్నారు. ‘కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు..’ఇవ్వలేదని మండిపడ్డారు. యువతకి ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ కొలువులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని బండి సంజయ్ వివరించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందీశ్వర్ గౌడ్ కు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బండి సంజయ్ కోరారు.