రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి.. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రగతిభవన్ లో వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్.
రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలేమిటి. ఎంత పండిస్తున్నారు. ఎంత దిగుమతి చేసుకుంటున్నారు. ఎంత ఎగుమతి చేస్తున్నారనే అంశాల్లో.. ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలని ఆదేశించారు కేసీఆర్. రాష్ట్రంలో ఏమి పండించాలి. ఏమి పండించవద్దు. ఏ పంటల సాగును ప్రోత్సహించాలి. మొత్తంగా ఏది లాభదాయకమనే విషయంలో నిర్ధిష్టమైన అభిప్రాయానికి రావాలని చెప్పారు. ఈ అంశాల్లో ఖచ్చితమైన వివరాలు రాబట్టేందుకు.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 10రోజుల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి.. సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ ఖచ్చితమైన అంచనాలతోనే రాష్ట్రంలో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పారు కేసీఆర్.
రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలన్నారు సీఎం. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని.. నిధుల సేకరణ కోసం మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్ కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని స్పష్టంచేశారు ముఖ్యమంత్రి. రైతులు పండించిన పంట మార్కెట్ కు వచ్చి, కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే రైతులకు చెక్కులిచ్చే పద్ధతి రావాలన్నారు. మార్కెటింగ్ శాఖే కొనుగోళ్లు చేయటం వల్ల పోటీతత్వం పెరుగుతుందని.. మంచిధర వస్తుందని అన్నారు. మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని ఆదేశించారు సీఎం.
