ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ గ్రామాలు బాగుప‌డ‌వు: సీఎం కేసీఆర్

ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ గ్రామాలు బాగుప‌డ‌వు: సీఎం కేసీఆర్

అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..‌వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి నరేగా(National Rural Employment Guarantee Act) పథకాన్నివ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని చెప్పారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ గ్రామం ప్రతీ రోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని సీఎం స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సిఎం చెప్పారు.

ఈ స‌మావేశంలో మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కలెక్టర్లు, డిపిఓ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం చేశారు.

CM KCR meeting with officials on telangana state villages at Pragati Bhavan