న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ దళాలు పెయింటింగ్‌తో వేసిన ఒక 2డీ సైనిక హెలికాప్టర్ బొమ్మను చూసి ఇజ్రాయెల్ సైన్యం నిజమైన హెలికాప్టర్ అని నమ్మేసింది. అంతేకాదు, దానిపై రూ. 25 కోట్ల విలువైన మిసైల్ ను వేసి పేల్చేసింది. వివరాల్లోకి వెళ్లితే..ఇజ్రాయెల్ సైన్యం ఈ నెల 4న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో ఒక హెలికాప్టర్ పార్క్ చేసి ఉండగా.. దాన్ని ఇజ్రాయెల్ మిసైల్ ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. ఇరాన్‌లోని శక్తివంతమైన ఎంఐ17 హెలికాప్టర్‌ను, కొన్ని బిల్డింగులను కచ్చితత్వంతో కూల్చివేశామని సోషల్ మీడియా ద్వారా ఇజ్రాయెల్ గర్వంగా ప్రకటించుకుంది.
అయితే, వైరల్ గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అది నిజమైన హెలికాప్టర్ కాదని..నేలపై పెయింటింగ్‌తో గీసిన హెలికాప్టర్ 2డీ డ్రాయింగ్ అని ఆరోపించారు. ఎండలోని ఏ వస్తువుకైనా నీడ ఉంటుందని.. కానీ ఇజ్రాయెల్ పేల్చిన హెలికాప్టర్‌కు నీడ లేదని ఎత్తిచూపారు. అది కేవలం 2డీ పెయింటింగ్ అని కామెంట్స్ చేశారు.
