‘కాళేశ్వరం’తో 50 వేల చెరువులు నిండాలె

‘కాళేశ్వరం’తో 50 వేల చెరువులు నిండాలె
  • లిఫ్టులకు టెండర్లు పిలవండి
  • ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
  • ‘కాళేశ్వరం’తో 50 వేల చెరువులు నిండాలె
  • ఒక్క బటన్ నొక్కితే చివరి ఆయకట్టుకు నీళ్లందాలె
  • రోహిణిలోనే నారుమళ్లకు నీళ్లివ్వాలె 
  • త్వరలోనే లష్కర్లు, జేఈల నియామకం
  • ఇరిగేషన్​లో ఒక్క పోస్ట్​ ఖాళీ ఉండొద్దని ఆర్డర్

హైదరాబాద్‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 50 వేల చెరువులను నిరంతరం నిండు కుండల్లా ఉంచాలని, ప్రాజెక్టు దగ్గర ఒక్క బటన్ నొక్కితే చివరి ఆయకట్టుకు నీళ్లందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించే స్థాయికి చేరుకున్నామని.. ఇది ఆషామాషీ విషయం కాదన్నారు. నెల్లికల్‌ సహా నాగార్జునసాగర్‌పై చేపడుతున్న అన్ని లిఫ్ట్‌ స్కీంలకు, కాల్వలకు టెండర్లు పిలువాలన్నారు. అలాగే రోహిణి కార్తెలోనే నారుమళ్లకు నీళ్లివ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఒక్క ఖాళీ ఉండొద్దని వెంటనే భర్తీ చేయాలన్నారు.  త్వరలోనే లష్కర్లు, జేఈల నియామకాలు చేపడతామన్నారు. మంగళవారం ఆయన ప్రగతి భవన్‌లో ఇరిగేషన్‌ అధికారులు, ఇంజినీర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రాణహితలో జూన్‌ 20వ తేదీ తర్వాత నీటి ప్రవాహం పెరుగుతుందని, అప్పటి నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని చెప్పారు. కాల్వల రిపేర్లు మొత్తం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరంతో 35 లక్షల ఎకరాలకు నీళ్లు
రోహిణి కార్తెలో నాటేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తదని రైతులు నమ్ముతారని వారికి ప్రాజెక్టుల నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రైతులు పండించే పంట వారికి మాత్రమే చెందదని, రాష్ట్ర సంపదగా మారుతుందని అన్నారు. కరోనా మొదటి దశలో పండిన పంట రాష్ట్ర జీఎస్డీపీలో 17 శాతం ఆదాయం సమకూర్చిందన్నారు. ఇరిగేషన్‌ శాఖ కృషితో రాష్ట్ర వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోయిందన్నారు. కాళేశ్వరం ద్వారా 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించే స్థాయికి చేరుకున్నామని, ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగి తవ్వుకున్న బోర్లు నేడు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు బటన్‌ నొక్కితే చివరి ఆయకట్టు దాకా నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం సీజన్‌లో చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు నింపడమే అన్నిటి కన్నా ముఖ్యమని సూచించారు. 50 వేల చెరువుల్లో నిరంతరం నిండుకుండల్లా నీరు నిల్వ ఉంచుకోవాలన్నారు. జూన్‌ 30 నాటికి మొదటి దశ చెక్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

నెల్లికల్​ పాత టెండర్లు రద్దు
నెల్లికల్‌ లిఫ్టుకు 24 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చే సామర్థ్యం ఉండటంతో పాత టెండర్‌ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలువాలని, ఈ ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి కావాలని ఆదేశించారు. దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం తలపెట్టిన లిఫ్టు స్కీంల అంచనాలను జూన్‌ 15 వరకు పూర్తి చేసి టెండర్లు పిలువాలన్నారు. ఈ బాధ్యతను మంత్రి జగదీశ్‌ రెడ్డి తీసుకొని ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. లిఫ్టులతో పాటు కాల్వలు, ఇతర పనులకు ఒకేసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు. సదర్​మట్‌ బ్యారేజీ నిర్మాణ పనులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్‌ డిపార్ట్​మెంట్‌లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రమోషన్‌లు ఇస్తూ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. కాల్వల నిర్వహణ కోసం త్వరలోనే లస్కర్లు, జేఈల నియామకం చేపడుతామన్నారు.

మల్లన్న సాగర్ పనులు జల్దీ చేయాలి
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల స్టేటస్‌ రిపోర్ట్‌ అందజేయాలని అధికారులకు సూచించారు. సమ్మక్క - సారక్క బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, టెక్నికల్‌ టీంను పంపి బ్యారేజీ మెయింటనెన్స్​పై ఇంజనీర్లకు ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం మూడో పంపు హౌస్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. హల్దీ వాగు ప్రాజెక్టు ఆధునీకరించి 7 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నారు. తూర్పు ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు చేపట్టే లిఫ్టుల సర్వే కోసం వ్యాప్కోస్‌తో సంప్రదింపులు జరపాలన్నారు. సింగూరుపై చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల డీపీఆర్‌లు సత్వరం సిద్ధం చేయించాలన్నారు. సీతమ్మసాగర్‌ పనులు ప్రారంభించామని ఈ సందర్భంగా ఇంజనీర్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి సీతమ్మసాగర్‌ పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్టులో తలెత్తే సమస్యలను స్మితా సబర్వాల్‌, శ్రీధర్‌ దేశ్‌పాండే దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. మల్లన్నసాగర్‌లో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల ఓ అండ్‌ ఎంపై జూన్‌ మొదటి వారంలో వర్క్​షాప్‌ నిర్వహించి, అవసరమైన పనులపై ముందే ఎస్టిమేట్లు రూపొందించాలని నిధులు ఇస్తామన్నారు. సమావేశంలో మంత్రులు జగదీశ్వర్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్‌ షిండే, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌ రెడ్డి, ఎం. శ్రీనివాస్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌, ఈఎన్సీలు మురళీధర్‌, హరిరాం, వెంకటేశ్వర్లు, నాగేందర్‌రావు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అడ్వైజర్‌ పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, సీఈలు, అధికారులు పాల్గొన్నారు.

కాల్వల రిపేర్లకు రూ.700 కోట్లు
ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా సూర్యాపేట జిల్లాలో చివరి ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చేశామని కేసీఆర్​ అన్నారు. మైలారం ట్యాంక్‌‌ నుంచి నీటిని తరలించే డీబీఎం71 కాల్వ లైనింగ్‌‌ చేపట్టాలన్నారు. హుస్నాబాద్‌‌, పాత మెదక్‌‌, ఆలేరు, భువనగిరి, జనగామకు మల్లన్నసాగర్‌‌ వరంలా మారనుందన్నారు. సీతారామ పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందని తెలిపారు. దేవాదులను వంద శాతం వరంగల్‌‌ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. ప్రాజెక్టు కాల్వల రిపేర్లకు700 కోట్లు కేటాయించామన్నారు. గేట్లు, కాల్వల రిపేర్లు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల ఓ అండ్‌‌ ఎం నిధులను ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచి ఇరిగేషన్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీకి బదలాయిస్తామని తెలిపారు.