హోం గార్డులకు గౌరవ వేతనమే దిక్కు .. అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు

హోం  గార్డులకు గౌరవ వేతనమే దిక్కు  .. అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు
  • ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించలే   
  • ఎలాంటి సౌకర్యాలు అందుతలేవ్ 
  • గౌరవ వేతనమూ టైమ్​కు ఇస్తలే  

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారింది. హోంగార్డులు యూనిఫామ్ సర్వీస్‌‌‌‌లో భాగమే అయినప్పకిటీ, ఇప్పటికీ వలంటరీ సర్వీస్‌‌‌‌గానే కొనసాగిస్తున్నారు. దీంతో వాళ్లకు గౌరవ వేతనం తప్ప, ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. ఎస్‌‌‌‌ఐ స్థాయి నుంచి హోంశాఖలో పని చేస్తున్న ప్రతి పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ వద్ద హోంగార్డ్‌‌‌‌ విధులు నిర్వహించాల్సిందే. అధికారుల ఇళ్లలో సర్వెంట్స్‌‌‌‌గా పనులు చేయాల్సిందే. కానిస్టేబుల్స్‌‌‌‌ కంటే ఎక్కువ పని గంటలు డ్యూటీ చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేకుండా పోయిందని, బస్ పాస్ లు, ఇతర అలవెన్సులేవీ అందడం లేదని.. ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం సరిపోక కుటుంబ పోషణ భారంగా మారిందని, అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందుతున్నారు. 

ప్రగతిభవన్ సాక్షిగా కేసీఆర్ హామీలు..

ఉమ్మడి రాష్ట్రంలో 38 వేల మంది హోంగార్డులు విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత 18 వేల మంది ఉన్నారు. రిక్రూట్ మెంట్ లేకపోవడం, రిటైర్మెంట్, కొందరు చనిపోవడంతో ప్రస్తుతం 16 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 6 వేల మంది డ్యూటీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనం రూ.12 వేలుగా ఉండేది. తెలంగాణ ఏర్పడినంక 2017 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 13న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రగతిభవన్‌‌‌‌లో హోంగార్డులతో సమావేశం నిర్వహించారు. గౌరవ వేతనాన్ని రూ.21 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 

ప్రతి ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్‌‌‌‌ ఇస్తామని తెలిపారు. డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌, బస్‌‌‌‌పాస్, ఏడాదికి నాలుగు యూనిఫామ్స్, టీఏ, బందోబస్తు డ్యూటీలు చేసేవారికి డైట్‌‌‌‌ ఛార్జీలు.. ఇలా కానిస్టేబుల్స్‌‌‌‌తో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇందులో ఒక్క గౌరవ వేతనం హామీ తప్ప, ఏదీ అమలు కాలేదు. 

కరోనా టైమ్​లో చందాలు.. 

కరోనా టైమ్ లో 20 మందికి పైగా హోంగార్డులు మృతి చెందారు. రాష్ట్రం వచ్చినంక వివిధ కారణాలతో ఇప్పటి వరకు దాదాపు 350‌‌‌‌‌‌‌‌ మంది హోంగార్డులు చనిపోయారు. వీరిలో డ్యూటీలో చనిపోయినోళ్ల కుటుంబాలకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రూ.30 లక్షల వరకు ఇన్సూరెన్స్‌‌‌‌ ఇచ్చింది. ప్రతినెల గౌరవ వేతనం నుంచి రూ.20 కట్ చేసి, ఎవరైనా హోంగార్డు చనిపోతే అంత్యక్రియలకు రూ.10 వేలు చెల్లిస్తున్నది. కరోనా టైమ్ లో కొంతమంది చనిపోగా హోంగార్డులే రూ.50 చొప్పున చందాలు వేసుకుని బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

సెలవుల్లేవ్.. 

హోంగార్డులకు అందుతున్న గౌరవ వేతనం కూడా టైమ్​కు ఇస్తలేరు. హైదరాబాద్‌‌‌‌లో పని చేస్తున్నవారికి మొదట్లో 1, 2 తేదీల్లో చెల్లించేవారు. గత 3నెలలుగా 5 నుంచి 10వ తేదీ మధ్యలో ఇస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్ల పరిధిలో 15 నుంచి 20వ తేదీ వరకు ఇవ్వడం లేదు. జిల్లాల్లో నెల ఆలస్యంగా చెల్లిస్తున్నారు. హోంగార్డులు బందోబస్తు డ్యూటీలకు సొంత డబ్బుతోనే ప్రయాణాలు చేస్తున్నారు. 

డ్యూటీలో భోజనం సొంత ఖర్చులతోనే చేయాల్సివస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అధికారి అనుమతి ఇస్తే తప్ప సెలవు ఉండదు. 2రోజులకు మించి సెలవు పెడితే, గౌరవ వేతనంలో కోత విధిస్తున్నారు. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదు.