నా ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను

నా ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను

అన్నదాతల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో  లేనటువంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఇస్తున్నామన్నారు. రైతు చనిపోతే  అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లో 5 లక్షల రూపాయాలను రైతు బీమా పేరుతో అందజేస్తున్నామన్నారు. రైతు రుణాలను రద్దు చేశామని చెప్పారు. ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొంగ‌ర‌క‌లాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా స‌మీకృత క‌లెక్టరేట్ స‌ముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్..రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అందిస్తున్నామన్నారు. 

తెలంగాణలో 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నం

కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారి ట్రాప్ లో పడొద్దన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశానికి 24 గంటలు విద్యుత్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని నిలదీశారు. దేశంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నా.. ప్రజలకు మంచినీటి అందించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. హైదరాబాద్ లో 24 గంటల కరెంట్ ఉంటే..దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఎప్పుడు కరెంట్ వస్తుందో..ఎప్పుడు పోతుంతో తెలియదన్నారు. తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకవన్నారు. 

కేంద్రం కుట్రలను ప్రజలు గమనిస్తున్నరు

కేంద్రం కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కుట్రలు పన్ని 9 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారని చెప్పారు. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. ఇది ప్రజా స్వామ్యమా లేక రాజకీయ అరాచకత్వమా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ ఏ వర్గానికి మంచి చేసింది

బీజేపీ ఏ వర్గానికి మంచి చేసిందో సమాధానం చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరులో కంటే హైదరాబాద్ నంబర్ స్థానంలో ఉందన్నారు. ఐటీ రంగంలో 1.55 లక్షల  మంది కి ఉద్యోగాలు కల్పించామన్నారు. కర్ణాటకలో రకరకాల మత పిచ్చి లేపి బెంగళూరులో భయంకరమైన వాతావరణాన్ని కల్పించారన్నారు. అందుకే అక్కడ ఉద్యోగాల కల్పనలో వెనుకబడిపోయిందన్నారు. చిల్లర రాజకీయాల కోసం బీజేపీ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నారు.

రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ

రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయనివ్వనని...దాని కోసం సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానన్నారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.