మరుగుజ్జులు ఏనాటికి మహాత్ములు కాలేరు

మరుగుజ్జులు ఏనాటికి మహాత్ములు కాలేరు
  •  తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఘోరంగా అవహేళన చేసిన్రు: సీఎం కేసీఆర్​
  •     గాంధీ బాటలో పోరాడి రాష్ట్రం సాధించుకున్నం
  •     ఎన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్నా శాంతి లేకపోతే జీవితం ఆటవికమే
  •     చెడును ఖండించాలె.. తప్పును విమర్శించాలె అని పిలుపు
  •     గాంధీ హాస్పిటల్​ ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహం ఆవిష్కరణ
  •     బీఎస్సీ నర్సింగ్‌‌ స్టూడెంట్ల స్టైపండ్‌‌ను రూ. 10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మహాత్మాగాంధీని కొందరు వెకిలి వ్యక్తులు కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల మాటలు వింటుంటే హృదయం చాలా బాధపడుతుందని, దు:ఖం కలుగుతుందని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘వెకిలి వ్యక్తులు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముని కృషి, మహాత్ముని ప్రభ ఏనాటికి తగ్గదు.. మరుగుజ్జులు ఏనాటికి మహాత్ములు కాలేరు” అని పేర్కొన్నారు.  తెలంగాణ కోసం పోరాడిననాడు తనను కూడా ఎగతాళి చేశారని, అయినా మహాత్ముడు చూపిన బాటలో పోరాడి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. గాంధీ హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఏర్పాటు చేసిన 16 అడుగుల ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని కేసీఆర్​ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. గాంధీ చూపిన అహింసా సిద్ధాంతమే ఎప్పటికీ నిలబడి ఉంటుందని అన్నారు. దేశం, సమాజం బాగుంటేనే ప్రపంచంలో శాంతి సామరస్యాలు ఉంటేనే అందరూ సుఖంగా ఉంటారని, అశాంతి నుంచి బయట పడుతారని పేర్కొన్నారు. గాంధీ స్ఫూర్తితోనే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ఆ పథకాలు దేశంలో అనేక అవార్డులు పొందుతున్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్య ఫలమని అన్నారు. గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు కోవలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యుగపురుషుడు గాంధీ అని కేసీఆర్​ పేర్కొన్నారు. ‘‘గాంధీ మానవోత్తముడు, విశ్వమానవుడు. గాంధీ స్ఫూర్తితో ఎన్నో దేశాలు పోరాడి స్వాతంత్య్రం పొందినయ్​” అని అన్నారు. 

వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నవంటున్నరు

సమాజాన్ని చీల్చేందుకు కొన్ని శక్తులు చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని కేసీఆర్​ దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి సమాజంలో పోకడలు, వైరుధ్యాలపై తప్పకుండా ఆలోచన చేయాలని అన్నారు. ఈ మధ్య భిన్నంగా, వేదాంత ధోరణిలో ఎందుకు మాట్లాడుతున్నావని తనను కొందరు అడుగుతున్నారని తెలిపారు. ఎన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్నా శాంతి లేకపోతే జీవితం ఆటవికమవుతుందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీతో పాటు ఆయన శిష్యుడు లాల్‌‌‌‌బహదూర్‌‌‌‌ శాస్త్రి జయంతి కూడా ఒకే రోజని అన్నారు. ‘‘జై జవాన్‌‌‌‌.. జై కిసాన్‌‌‌‌ అని లాల్​బహదూర్​ శాస్త్రి పిలుపునిస్తే ఇప్పుడు జవాన్‌‌‌‌ అగ్నిపథ్‌‌‌‌లో నలిగిపోతుంటే.. కిసాన్‌‌‌‌ మద్దతు ధర లేక కృషించి, నశించిపోతున్నాడు. ఇవన్నీ మీ కండ్లముందే జరుగుతున్నయ్​. వాటిపై ఆలోచన చేయాలి. మనం మౌనం పాటించొద్దు. చెడును ఖండించాలె.. తప్పును విమర్శించాలె.. మంచిని ప్రశంసించాలె” అని సూచించారు. సైనికుల ఆందోళనను, రైతుల ఆత్మహత్యలను నివారించకపోగా వాటిపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను మేధావులు  ఖండించాలని  అన్నారు.  ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారిని గాంధీ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లు సమర్థంగా ఎదుర్కొన్నారని అభినందించారు. కనీస వసతులు, పీపీఈ కిట్లు లేకున్నా సేవలందించారని కొనియాడారు. బీఎస్సీ నర్సింగ్‌‌‌‌ స్టూడెంట్ల స్టైపండ్‌‌‌‌ను రూ. 5 వేల నుంచి 10 వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌‌‌‌రావు, తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌, ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌, మేయర్‌‌‌‌ గద్వాల్‌‌‌‌ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదిరతులు పాల్గొన్నారు.