దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ మూవీతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ కేరళ కుట్టి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లేటెస్ట్ ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టుకు సంతం చేసింది.
సూపర్ హిట్ కాంబో రిపీట్!
ఈ ప్రాజెక్ట్ ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే జోడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇద్దరి కాంబోలో డిజిటల్ హిట్ తర్వాత బిగ్ స్క్రీన్‌పై ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం 'అనుపమ x RJ షాన్' అని పిలుస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. అనుపమ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. మేకర్స్ అనుపమకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
భారీ నిర్మాణ సంస్థల కలయిక
ఈ చిత్రాన్ని శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం. గతంలో వీరు రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ ఫేమ్ వంటి చిత్రాలను అందించారు. అనుపమలో ఒక అరుదైన ప్రతిభ ఉంది. ఏ భాషలోనైనా ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సహజత్వం ఆమె సొంతం అని ప్రేరణ అరోరా అన్నారు . ఈ కథకు ఆమె ప్రాణం పోస్తుందని మా నమ్మకం అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే 'జటాధర' మూవీని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ సంస్థ నిర్మాణంను మరింత విస్తరిస్తోందని తెలిపారు.
ఇక అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రేమమ్, కార్తికేయ 2, రాక్షసుడు వంటి హిట్ సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా అనుపమ కొనసాగుతున్నారు. ఈ కొత్త థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో అను మరోసారి తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు..
