పోతిరెడ్డిపాడును మేం గుర్తిస్తలేం

పోతిరెడ్డిపాడును మేం గుర్తిస్తలేం
  •     కేఆర్‌ఎంబీ త్రీమెన్‌ కమిటీ సమావేశం రద్దు చేయాలి
  •     కృష్ణా నీళ్లను ఏపీ, తెలంగాణకు చెరి సగం కేటాయించాలి
  •     రాయలసీమ లిఫ్ట్​ కూడా అక్రమమే హైలెవల్​ మీటింగ్​లో తీర్మానం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమమేనని, దాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిప్టు స్కీం కూడా అక్రమ ప్రాజెక్టేనని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన హైలెవల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం, ఎత్తిపోతలు, కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. రైతుల కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని చెప్పారు. ఈ నెల 9న కేఆర్ఎంబీ నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని, కృష్ణా నీళ్ల తాత్కాలిక కేటాయింపులను రివ్యూ చేయాలని, ఈ నీటిని రెండు రాష్ట్రాలకు  చెరి సగం (50:50) కేటాయించాలన్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌  అలకేషన్‌‌‌‌‌‌‌‌ను ముందు పెట్టి, అక్రమ ప్రాజెక్టులకు ఏపీ నీటిని తరలిస్తోందని, కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకే కృష్ణా నీళ్లు తీసుకోవాలన్నారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని, రైతులకు అన్యాయం చేశారని కేసీఆర్​ మండిపడ్డారు.  రాబోయే రోజుల్లో కృష్ణా, గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం చెప్పారు. ట్రిబ్యునళ్ల ద్వారా తెలంగాణకు కేటాయించిన నీళ్లను లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి జల విద్యుత్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా చేస్తామని, దీనిపై కేబినెట్‌‌‌‌‌‌‌‌ తీర్మానం చేశామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు హక్కుగా ఇచ్చిన నీటిని తీసుకోవడానికి సహకరిస్తామని, కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీళ్లు తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. 

ఏపీలో కాలు అడ్డం పెడితే నీళ్లు పారించుకోవచ్చు

రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాటానికి సిద్ధమని కేసీఆర్​ తెలిపారు. తెలంగాణకు చేసిన నీటి కేటాయింపులకు లోబడే కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేస్తున్నామని, దీనిపై ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీళ్లేదని, ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్లు, కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, న్యాయస్థానాలతో పాటు ప్రజాక్షేత్రంలోనూ చెప్తామన్నారు. ఏపీలో కాలు అడ్డం పెడితే నీళ్లు పారించుకోవచ్చని, తెలంగాణలో ఎత్తిపోతల తప్ప మరో మార్గం లేదని చెప్పారు. వైఎస్‌‌‌‌‌‌‌‌ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా వరద జలాలనే వాడుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారని, బ్రజేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు అదే విషయం చెప్పారని పేర్కొన్నారు.  ఇప్పుడు మాట మార్చి తెలంగాణ నీటి హక్కులు హరిస్తామంటే సహించబోమన్నారు. కాళేశ్వరం కోసం మహారాష్ట్రతో స్నేహంగా ఉన్నట్టుగానే ఏపీతోనూ అదే పద్ధతి అవలంబించేందుకు స్నేహహస్తం అందించామని, అయినా వారు పెడచెవిన పెట్టారన్నారు.  

జగన్‌‌‌‌‌‌‌‌ను ఒక్క మాట అనని కేసీఆర్​

పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టు, జల విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిపై కేసీఆర్​ నిర్వహించిన హై లెవల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ తర్వాత సీఎంవో ప్రెస్‌‌‌‌‌‌‌‌నోట్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఇందులో ఎక్కడా ఏపీ సీఎం జగన్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఒక్క మాటా అన్నట్టు పేర్కొనలేదు. వైఎస్‌‌‌‌‌‌‌‌ గురించి ప్రస్తావించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న జగన్‌‌‌‌‌‌‌‌ను ఏమీ అనకపోవడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. జగన్‌‌‌‌పై తెలంగాణ మంత్రులు నిప్పులు చెరుగుతున్నా.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నోరెత్తకపోవడం వారిద్దరి మధ్య దోస్తీకి సాక్షిగా నిలుస్తోందన్న వాదనలూ ఉన్నాయి.

రేపు కృష్ణా బోర్డుకు లెటర్​!

కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి, త్రీమెన్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశంపై సోమవారం కృష్ణా బోర్డుకు లెటర్​ రాయాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

హైలెవల్​ మీటింగ్​లో చేసిన తీర్మానాలు 

  • జులై 9న  కేఆర్ఎంబీ నిర్వహించబోయే త్రీమెన్‌ కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలి.  జులై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలి. పోతిరెడ్డిపాడు, రాయలసీమ పేరుతో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై వాదనలు వినిపించాలి. 
  • కృష్ణా నీళ్లలో ఏపీ,  తెలంగాణ మధ్య ఇప్పటి వరకు ఉన్న 66 : 34 నిష్పత్తిలోని నీటి పంపకాలకు తిరస్కరణ. ఈ సంవత్సరం నుంచి 50 : 50 నిష్పత్తిలో పంపకాలు చేయాలి. నికర జలాల్లో చెరిసగం, అనగా 405.5 టీఎంసీల చొప్పున రెండు రాష్ట్రాలకు కేటాయించాలి.  కొత్త ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ఏర్పడి పంపకాలు చేపట్టేదాకా దీనిని కొనసాగించాలి. 
  • రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిని కొనసాగించాలి.
  • కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదని, జల విద్యుత్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని ప్రకటన. 
  • గ్రీన్ ట్రిబునల్ స్టేను ఉల్లంఘించినందుకు ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌ను జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించింది.. అయినా మొండిగా నిర్మాణాలు చేపట్టడం అన్యాయం. 
  • సమ్మక్క బ్యారేజీ సహా సీతమ్మసాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలవాలి.
  • శ్రీశైలం మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్ ఉద్యోగులను తప్ప, వేరెవరినీ అనుమతించవద్దు. శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి.