
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నేను దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీని మీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఎలా ? అని చాలామంది అడిగారు. అందుకే దేశ ప్రజల కోసం బీఆర్ఎస్ ను ప్రకటించాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయింది. నాకు రాజకీయం ఒక టాస్క్’’ అని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకుపోతామని వెల్లడించారు. ‘‘ దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎంతో ఆహార భద్రత ఉన్న మన దేశం ఇంకా ప్రాసెసింగ్ ఫుడ్ పైన ఆధారపడం సిగ్గుచేటు. విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ ను దిగుమతి చేసుకోవడం దారుణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రకటన చేసిన అనంతరం సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను కూడా బీఆర్ఎస్ కలుపుకుపోవాలని కోరారు.