నేను చెప్పేది తప్పయితే టీఆర్​ఎస్​ను ఓడించండి

నేను చెప్పేది తప్పయితే టీఆర్​ఎస్​ను ఓడించండి

కొంత మంది కాంగ్రెస్​ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. ఈ మధ్యల బీజేపోళ్లు కొత్త బిచ్చగాడు పొద్దెరగడనట్టు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. మీలాగా మేం మిడిసిపడాలంటే, మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చాత కాక కాదు. మీలాంటోళ్లు ఎంత మంది ఉన్నరు. పిడికెడు మంది కూడా లేరు.మేం తలుచుకుంటే మీరు నశం కూడా మిగలరు. దుమ్ము దుమ్మయిపోతరు. ఇంకా ముల్లు ఎక్కువగా ఉన్నదంటే ఆ ముల్లును కూడా పొల్లుపొల్లు చేసి తీరుతం జాగ్రత్త.  ఇక్కడ ఎవడూ చేతులు ముడ్చుకుని కూర్చోడు. వాళ్ల పార్టీలు, వాళ్ల నాయకత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలె జాగ్రత్త అని హెచ్చరిస్తున్న.  పిచ్చికార్యక్రమాలు బంద్ చేసుకోవాలే.  లేదంటే మీరే నష్టపోతరు. మాది ఢిల్లీ వోడు..ఇంకోడు నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు. మీలాగా డంబాచారాలు చెప్పే ప్రభుత్వం కాదు.

నల్గొండ, వెలుగు: తాము చాలా మంది రాకాసులతోనే కొట్లాడామని, ఈ గోకాసులు తమకు గోశి కింద కూడా లెక్క కాదని, తొక్కి పడేస్తామని బీజేపీ, కాంగ్రెస్​ నేతలపై సీఎం కేసీఆర్​ ఫైర్​ అయ్యారు. తాము తలచుకుంటే నశం కూడా మిగలరని, పొల్లు పొల్లు చేసి తీరుతామని హెచ్చరించారు. ఎవరూ చేతులు ముడుచుకొని కూర్చోలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలోని నెల్లికల్లు వద్ద రూ. 2,500 కోట్లతో చేపడుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. సాయంత్రం 4 గంటలకు హాలియాలో ఏర్పాటు చేసిన ‘ఉమ్మడి నల్గొండ జిల్లా ధన్యవాద సభ’లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్​ బై ఎలక్షన్​ను దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లాకు వరాలు ప్రకటించారు.

మాది వీరుల పార్టీ

‘‘టీఆర్ఎస్  పార్టీ అంటే వీరుల పార్టీ.. వీపు చూపించే పార్టీ కాదు. నల్గొండ ప్రజానీకానికి చెప్తున్నా.. ఈ లిఫ్టులన్నీ కంప్లీట్ చేసి మీకు అందించకపోతే వచ్చే ఎలక్షన్​లో  ఓట్లు అడగం” అని కేసీఆర్​ స్పష్టం చేశారు. స్థానిక లీడర్లు అంతా సహకరించి ఒకటిన్నర సంవత్సరంలోపే కంప్లీట్ చేసి పండుగ చేసుకునే పరిస్థితి తీసుకురావాలన్నారు. కృష్ణా నదిలో నీళ్లు రానప్పుడు వాడుకునే విధంగా ఖమ్మం జిల్లాలోని సీతారామా ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపుతున్నామని చెప్పారు. పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువన ఉన్న దేవులపల్లి బ్యాలెన్సింగ్
రిజర్వాయర్​కు  లిఫ్ట్ పెడితే ఇక శాశ్వతంగా నల్గొండ ఆయ కట్టుకు నీళ్లు లేవనే మాట రాదన్నారు.  ఆ పనికి రూ.600 కోట్లతో ఎస్టిమేట్ రెడీ అయిందని, అది కూడా తొందర్లోనే శాంక్షన్ చేస్తామని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇయ్యక పోతే ఓట్లు అడిగమని గతంలో చెప్పి,  ప్రూవ్ చేసుకున్నామని సీఎం కేసీఆర్​ అన్నారు.

కృష్ణా, గోదావరిని అనుసంధానిస్తం

శాశ్వతంగా నల్గొండ  జిల్లా ఆయకట్టు బ్రహ్మాండంగా ఉంటుందని, అవసరమైన సందర్భంలో వాడుకోవడానికి వీలుగా గోదావరి నీళ్లను కూడా పెద్దదేవులపల్లికి తీసుకొచ్చి కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసి నల్గొండ జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామని కేసీఆర్​ చెప్పారు. త్వరలో తాను జిల్లాల్లో మకాం వేస్తానని సీఎం కేసీఆర్​ చెప్పారు. ‘‘నేను స్వయంగా బయల్దేరి జిల్లాకు ఒకటి, రెండు రోజులు మకాం పెట్టి, పోడు భూముల సమస్యను కూడా వెంటనే పరిష్కరిస్తం” అని అన్నారు. తన మిత్రుడు నోముల నర్సింహయ్య ఈ సభలో తన పక్కన లేకపోవడం చాలా బాధాకరమని కేసీఆర్​ అన్నారు.

పిచ్చివాగుడుకూ హద్దులుంటయ్​

సహనానికి , పిచ్చివాగుడుకు కూడా హద్దులు ఉంటాయని, ఆ హద్దు మీరిన నాడు ఏం చేయాలో తమకు తెలుసని ప్రతిపక్షాలకు కేసీఆర్​ హెచ్చరించారు. వేరే సభ కాడ వచ్చి వీరంగం వేస్తమంటే అది మంచి సంస్కారం కాదని, ఎవరూ హర్షించరని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

తెలంగాణ పేరెత్తే అర్హత కాంగ్రెస్​కు లేదు

తెలంగాణలో ఈ నాడున్న దుస్థితికి, ఆనాడు ఉన్న దుస్థితికి కాంగ్రెస్​ పార్టీ కారణమని కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరెత్తే అర్హత కూడా లేదు.  ఈ రోజు హైదరాబాద్ రాష్ట్రం బ్రహ్మండగా ఉంటుండె. అనేక భాషలతోటి, అనేక మతాల తోటి ఒక విభిన్నమైన సంస్కృతి తోటి చాలా గొప్పగా ఉంటుండె. అటువంటి అద్భుతమైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా..? మూడు ముక్కలు చేసి ఒక ముక్కను మహారాష్ట్రలో.. ఇంకో ముక్కను కర్ణాటకలో.. మరో ముక్కను ఆంధ్రాలో కలిపిన దుర్మార్గులు ఎవరు..?” అని  ప్రశ్నించారు.

పొలం బాట, పోరు బాట.. నీ బొంద బాట

‘‘నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నాయకుడు మాట్లాడుతున్నడు. పొలం బాట.. పోరుబాట అని బయల్దేరిండు. ఏమైంది పొలానికి..? ఇయ్యాల మీకు నీళ్లు వస్తున్నయ్..ఆ నీళ్లు అవసరం లేదా ..? ఇయ్యాల ఇదే నల్గొండ జిల్లాలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తికాబోతున్నది. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లంల లిఫ్టు త్వరలో పూర్తికాబోతుంది. ఈ బడ్జెట్లో వాటికి అవసరమైన నిధులు కేటాయించి, వాటిని పూర్తిచేస్తం” అని కేసీఆర్​ అన్నారు. ‘‘అప్పట్లో సీఎంగా ఉన్న కిరణ్​కుమార్​రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేనని చెబితే ఒక్క కాంగ్రెస్​ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఇవాళ పెద్ద నోరు పెట్టుకొని.. పొలం బాట, పోరుబాట.. అని తిరుగుతున్నరు. పొలం బాట, పోరు బాట.. నీ బొంద బాట” అని ఫైర్​ అయ్యారు. ‘‘రైతులకు రైతుబంధు వస్తున్నందుకా..? రైతు బీమా వస్తున్నందుకా..? ఉచిత కరెంట్ వస్తున్నందుకా..? మంచిగా పంటలు పండుతున్నందుకా..? పొలం బాట.. పోరు బాట చేస్తున్నది” అని నిలదీశారు. దేశంలోనే అత్యధిక వడ్లు ఎఫ్​సీఐకి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో బస్వాపురం, గంధమల్ల ప్రాజెక్టులు పూర్తిచేసి వచ్చే జూన్ నుంచి ఆలేరు, భువనగిరి సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు.

వంద శాతం ఫ్లోరైడ్​ భూతాన్ని తరిమేసినం

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంలో లక్షా 50 వేల మంది జీవితాలను పొట్టన పెట్టుకున్నారని, అప్పట్లో ఒక్కడన్న దీనిపై మాట్లాడారా, ఉద్యమాలు చేశారా అని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘ఫ్లోరైడ్ బిడ్డలను తీసుకెళ్లి ఆనాటి ప్రధాని వాజ్​పేయి టేబుల్ పైన పండపెడితే కూడా మాట్లాడే దిక్కులేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వంద శాతం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేయడం జరిగింది. మంచినీళ్లు సప్లయ్​ చేయడం జరిగింది. ఈ రోజుల సాగర్​లో  రెండు పంటలకు నీటి వాటాలు తీసుకుంటున్నం” అని అన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం తెస్తం

ఇంకో నాలుగు రోజులు పోతే ఇండియాలోనే భూ సమస్యలు, భూ పంచాయితీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతున్నదని కేసీఆర్​ అన్నారు. ఇంకా కూడా కొత్త చట్టం తీసుకొచ్చి ఎవరికి కూడా రూపాయి ఇవాల్సిన అవసరంలేకుండా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు. ‘‘30 లక్షల యాదవ జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో గొర్రెలు దిగుమతి అయితే మనకు సిగ్గుచేటు అని భావించి మనమే ఎగుమతి చేసే పరిస్థితి రావాలని రెండేండ్ల నాడు కార్యక్రమం మొదలు పెట్టిన. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత నాదే.  ఈ సంవత్సరం మార్చి తర్వాత మళ్లా రెండు లక్షల కుటుంబాలకు ఇయ్యబోతున్నం. వచ్చే ఏడాది మరొక రెండు లక్షల కుటుంబాలకు ఇస్తం” అని వెల్లడించారు. ఆధునిక సెలూన్ల కోసం నాయి బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మంజూరు చేయబోతున్నామన్నారు.

నేను చెప్పేది తప్పయితే టీఆర్​ఎస్​ను ఓడించండి

దామరచర్లలో నాలుగు వేల మెగావాట్ల ‘యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్’ నిర్మాణం జరుగుతోందని, రాబోయే రెండేండ్లలో పనులు పూర్తయి రాష్ట్రంలోనే అత్యధిక పవర్ ఉత్పత్తి చేసే పవర్ జనరేషన్ స్టేషన్ రాబోతున్నదని సీఎం చెప్పారు. దీనికోసం రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ‘‘నేను చెప్పిన మాట్లలో ఒక్క మాట అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమే అయితే వేరే పార్టీకి డిపాజిట్ రాకుండా గులాబీ జెండా ఎగురవేయండి” అని అన్నారు. ‘‘ఇవి లఫంగీ మాటలు కాదు. యాదాద్రి దివ్యక్షేత్రం రెండు వేల కోట్లతో పూర్తి కృష్ణ శిలలతోనే ప్రపంచమే అబ్బుర పడే రీతిలో తయారవుతోంది” అని చెప్పారు.

దళితుల కోసం వెయ్యి కోట్ల బడ్జెట్

దళితుల కోసం ఈ బడ్జెట్​లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని కేసీఆర్​ చెప్పారు. ‘‘కొంత వివక్ష జరిగింది కాబట్టి దళిత జాతి వెనకబడింది. మనం అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది. అన్ని వర్గాల ప్రజలు బాగుంటనే మనం బాగుంటం. మన దళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా ఉంది. వాళ్ల కోసం ఈ ఏడాది బడ్జెట్​లో సీఎం ఎంపవర్​మెంట్​ పేరు పెట్టి రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నాం”అని వివరించారు.  రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ  త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని, కొత్త  రేషన్​ కార్డులనూ పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు.

నాగార్జునసాగర్​ను ఇప్పుడున్న చోట కట్టాల్సింది కాదు

నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఇప్పుడున్న చోట కట్టాల్సింది కాదని సీఎం అన్నారు. ‘‘ఈ ప్రాజెక్టు కట్టాల్సింది ఏలేళ్వరం గ్రామం దగ్గర 19 కి.మీ పైకి కట్టాలి. కానీ ఆ నాడు ఉన్న దుర్మార్గుడు కేఎల్​రావు, ఆనాడున్న నాయకుడు కుట్రలు చేసి, నీళ్ల వాటాలు తగ్గించి దాన్ని 19 కి.మీ కిందికి కట్టిండ్రు. ఇయ్యాల నేను శంకుస్థాపన చేసిన నెల్లికల్లు, దేవరకొండ లిఫ్టులు గానీ, ఏలేశ్వరం దగ్గర నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టి ఉంటే ఈ లిఫ్టుల అవసరం ఉండేది కాదు” అని చెప్పారు.

కాంగ్రెస్​ది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం

‘‘కల్యాణ లక్ష్మీ దేశంలో ఎవడన్న ఇచ్చిండా..? ఎవ్వడు ఇయ్యడు. కంటి వెలుగు ద్వారా 60 లక్షల మందికి చెక్ చేసి కళ్లద్దాలు ఇచ్చినం. ఇది ఇండియాల ఎక్కడన్న జ రిగిందా..? కేసీఆర్ కిట్టు ఇస్తున్నం. ధరణి తెచ్చినం. ధరణి తీసుకురావడంతో లంచాల బాధ పోయిందా..? పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు అయిపోతున్నయ్​” అని కేసీఆర్​ అన్నారు. కానీ, కాంగ్రెస్​ హయాంలో రైతులు ఆర్డీవో ఆఫీసు చుట్టూ ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని చెప్పారు. ‘‘మీది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం” అని మండిపడ్డారు.

మీలాంటి కుక్కలు చాలా ఉంటయ్..నిరసనకారులపై సీఎం ఫైర్​

సభలో సీఎం ప్రసంగిస్తుండగా ‘దళిత శక్తి’ ప్రోగ్రామ్​కు  చెందిన కొందరు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని, కరెంట్​ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పలువురు ప్లకా ర్డులతో నిరసన తెలిపారు. వారిపై సీఎం సీరియస్ అయ్యారు. ‘‘వాళ్లు కాగితాలు పట్టుకొస్తుండ్రు. పోలీసులూ..  ఆ కాగితాలు తీసుకోండి” అని అన్నారు. తర్వాత.. ‘‘ఇచ్చిండ్రు.. అయిపోయింది. బయటకు వెళ్లండి. మీరు పిచ్చిపని చేయకండి. ఇక్కడ ఎవడూ డిస్ట్రబ్​కాడు. మీరే దెబ్బ తింటరు. మీరు ఐదుగురు లేరు… ఒట్టిగా నశమైపోతరు. ఈ డ్రామాలు మేం చాలా చూసినమమ్మా. మీలాంటి కుక్కలు చాలా ఉంటయ్​.  బయటకు వెళ్లండి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.