హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం

హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం

హైదరాబాద్, వెలుగు: హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైన నేపథ్యంలో ఈనెల 15న తెలంగాణ భవన్​లో పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారికి బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. తర్వాత హైదరాబాద్​నుంచి నేరుగా హుస్నాబాద్​కు చేరుకుని.. ప్రచార సభలో పాల్గొననున్నారు. 18 వ తేదీ వరకు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించి ప్రచారం చేయనున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో, 18న జడ్చర్ల, మేడ్చల్​ నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కొంత గ్యాప్ ఇచ్చి.. దసరా తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి కేసీఆర్ దిగనున్నారు. నామినేషన్ల దాఖలుకు నవంబర్​పదో తేదీ వరకు గడువు ఉండటంతో అంతకు ఒకరోజు ముందే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ నామినేషన్​దాఖలు చేయనున్నారు. నవంబర్​9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ ​పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత గజ్వేల్‌‌‌‌లో,  కామారెడ్డికిలో  నామినేషన్ ​వేస్తారు.  కామారెడ్డిలో సభలో పాల్గొంటారు.

కోనాయపల్లి, హుస్నాబాద్​ సెంటిమెంట్

హుస్నాబాద్‌‌‌‌తో ప్రచారం ప్రారంభించడం అనే సెంటిమెంట్‌‌‌‌ను కేసీఆర్ మళ్లీ కొనసాగిస్తున్నారు. 2018లో సెప్టెంబర్​6న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. అప్పుడు హుస్నాబాద్ బహిరంగ సభతోనే ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఈసారి హుస్నాబాద్​లోనే తొలి ప్రచార సభ నిర్వహిస్తున్నట్టు ప్రగతి భవన్​నుంచి అధికారికంగా సమాచారం ఇచ్చారు. కేసీఆర్​ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్​ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాతే నామినేషన్​ దాఖలు చేస్తారు. 

70 ప్రచార సభలకు  కేసీఆర్

నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 70 ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబర్​28 సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రచార సభలు ఉండనున్నట్టు సమాచారం. నవంబర్​15 నుంచి వరుసగా కేసీఆర్ సభలు ఉండే అవకాశముంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై బీఆర్ఎస్ చీఫ్ ఎక్కువగా ఫోకస్​చేసినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ప్రచార సభ ఉంటుందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్​రావడంతో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండేసి ప్రచార సభల్లో పాల్గొననున్నట్టు చెప్తున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కేటీఆర్​రోడ్​షోలకు ప్లాన్​చేస్తున్నారు. మిగతా చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్​ఉమ్మడి జిల్లా ప్రచార బాధ్యతలు ఎమ్మెల్సీ కవిత చూసుకోనున్నారు. 

గ్రేటర్​తో పాటు ఉత్తర తెలంగాణ బాధ్యతలు మంత్రి కేటీఆర్, ఉమ్మడి మెదక్​తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రచారాన్ని మంత్రి హరీశ్​రావుకు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్​వచ్చే లోపే కేటీఆర్, హరీశ్​రావు 60కి పైగా నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల షెడ్యూల్​రావడానికి కొద్దిసేపటి ముందే జయశంకర్​భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​ను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వార అధికారిక కార్యక్రమాలను ఆపేసి పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంత్రి హరీశ్​రావు ప్రగతి భవన్​లోనే ఉండి ప్రభుత్వపరంగా చక్కబెట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్​చేశారు. బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి పండుగలను మినహాయించి కేటీఆర్, హరీశ్​రావు నిత్యం ప్రజల్లోనే ఉండేలా షెడ్యూల్​సిద్ధం చేస్తున్నారు.