ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలె

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలె

హైదరాబాద్: శుభకృత్ నామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. శనివారం ప్రగతి భవన్ లో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పంచాంగం లో ఏముందో కానీ సంతోష్ కుమార్ శాస్త్రి నోటి నుంచి మంచి మాటలు వచ్చాయని, ఆ మాటలు నిజం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. గడిచిన ఏడేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని అద్భుత ఫలితాలు తెలంగాణ సాధించిందన్నారు. తెలంగాణలో భూముల విలువ అమాంతంగా పెరిగిందని, దీంతో సంపద కూడా బాగా వృద్ధి చెందిందని తెలిపారు.

అన్ని వర్గాల ప్రజలు బాగున్నప్పుడే సమాజం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. దళిత బంధు ఎన్నికల స్టంట్ కాదని, ఆర్ధికంగా వెనుకబడిన దళితులను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన అద్భుత కార్యక్రమమని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి,  స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.