సంతోష్​, హరీశ్, కేటీఆర్​లకు పడ్తలేదు

 సంతోష్​, హరీశ్, కేటీఆర్​లకు పడ్తలేదు

నల్గొండ/ఎల్బీ నగర్, వెలుగు:  ‘‘కుటుంబ పాలన వల్లే శ్రీలంక నాశనమైపోయింది. అదే పరిస్థితి తెలంగాణకూ వస్తది. సీఎం కేసీఆర్ పొరపాటున​ఢిల్లీలో ఇంకో పదిహేను రోజులుంటే ఆ పార్టీ నేతలు సంతోష్, హరీష్​రావు, కేటీఆర్​కత్తులతో పొడుచుకుంటరు. కేసీఆర్ గనుక పొరపాటున అమెరికాకో లేదంటే మరోదేశానికో పోతే టీఆర్ఎస్16 ముక్కలవుడు ఖాయం. అట్లా జరగకపోతే నా పేరు వెంకట్​రెడ్డే కాదు” అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ స్టార్ క్యాంపెయినర్​గా ఏఐసీసీ నియమించిన సందర్భంగా ఆదివారం నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్​లో హరీశ్​రావు, కేటీఆర్ రోజూ కొట్లాడుకుంటూనే పని చేస్తున్నరు. నిన్నమొన్న పుట్టిన టీఆర్ఎస్​లోనే14 గుంపులున్నయ్. అలాంటిది130 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్​లో చిన్నచిన్న మనస్పర్థలు సహజం” అని ఆయన చెప్పారు. ఆరుగురు ఎమ్మెల్సీలు, ఎంపీ, ఇద్దరు మంత్రులు, కవిత కలిసి కాళేశ్వరం పేరు మీద కోట్లలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ అవినీతిపై ప్రధాని  నరేంద్ర మోడీకి వివరించానన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే మిషన్​భగీరథ పేరిట రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందన్నారు.   


కేసీఆర్​లా ఉత్తుత్తి హామీలియ్యం.. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కేసీఆర్ అబద్ధాల లెక్క ఉండదని కోమటిరెడ్డి అన్నారు.పెన్షన్లు, కౌలురైతుల సమస్యలు, ఇండ్లు ఇలా నాలుగైదు ముఖ్యమైన అంశాలతోనే మేనిఫెస్టో ఉంటుందన్నారు. తనను స్టార్​ క్యాంపెయినర్​గా అధిష్టానం నియమించడంలో సహకరించిన పీసీసీ చీఫ్​ రేవంత్, ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డిలకు థాంక్స్ చెప్పారు. కాగా, పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరులో దళితుల అసైన్డ్ వ్యవసాయ భూముల్లో నిర్మించిన గదులను రెవెన్యూ అధికారులు కూల్చివేయడాన్ని కోమటిరెడ్డి తప్పుపట్టారు. ఆదివారం బాధిత రైతులను కలిసి వారి దీక్షకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు భూములు ఇస్తే టీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ఆ భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తోందన్నారు. కుంట్లూరు, భూదాన్ కాలనీలో మురుగునీటి కాలువ నిర్మాణం కోసం 50 ఇండ్లను కూల్చివేయాలని చూస్తున్నారని, పేదల ఇండ్లను కూలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.