సీఎం హామీలు నీటిమూటలయ్యాయి

సీఎం హామీలు నీటిమూటలయ్యాయి
  • ఆగమేఘాల  మీద డీపీఆర్ రెడీ చేసిన ఆఫీసర్లు
  • ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
  • కుఫ్టి పూర్తయితే 40 వేల ఎకరాలకు మేలు
  • కడెంకు తప్పనున్న ముప్పు

ఆదిలాబాద్‍, వెలుగు: ‘‘కుప్టి రిజర్వాయర్​ కోసం టెండర్లు పిలవండి.. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించండి” ఇది సీఎం కేసీఆర్​ రెండేళ్ల క్రితం ఇరిగేషన్ ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో ఇచ్చిన ఆదేశాలు. కానీ..   సీఎం హామీలు నీటిమూటలయ్యాయి. ప్రచారం కోసమే రిజర్వాయర్​ పేరు ప్రచారంలోకి తీసుకొస్తున్నారే తప్ప.. ప్రజలకు చేసింది మాత్రం ఏమీలేదని రైతులు పేర్కొంటున్నారు.

కుప్టి కట్టరు.. వరద ఆపరు..

ఆదిలాబాద్ జిల్లాలోని కుప్టి వాగుపైనే కడెం ప్రాజెక్టు ఆధారపడి ఉంది. మొన్నటి వర్షాలకు వాగు ఉగ్రరూపం దాల్చడంతో కడెంకు  వరద పోటెత్తింది. అయితే కుప్టి వద్ద బ్యాలెన్సింగ్​రిజర్వాయర్ కడితేనే కడెంకు వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంది. అంతే కాదు వ్యవసాయానికి ఆబి.. తాబి నీళ్లీయవచ్చు. కుంటాల జలపాతం ఏడాది పాటు పరవళ్లు తొక్కనుంది. రిజర్వాయర్​ లేకపోవడంతో ఏటా వరద పోటెత్తి భారీ నష్టం జరుగుతోంది. నీరంతా వృథాగా పోతోంది.

రెండేళ్ల క్రితం..

రెండేళ్ల క్రితం నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద కడెం నదిపై రెండు కొండల మధ్య కుఫ్టి రిజర్వాయర్​ కట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.  దీని ద్వారా 6 టీఎంసీలను వినియోగంలోకి తీసుకోవచ్చని ఆఫీసర్లు భావించారు. విద్యుత్ ఉత్పత్తి, మూడు టీఎంసీలతో లిఫ్ట్​ ఇరిగేషన్​కు సౌకర్యంగా ఉంటుందని తలిచారు. మొదట రూ. 794  కోట్లతో రిజర్వాయర్​కట్టేందుకు అంచనాలు రూపొందించగా, ఐదు నెలల క్రితం మళ్లీ వ్యయం రూ. 900 కోట్లకు పెంచి ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదించారు. కుమారి గ్రామ పంచాయతీ పరిధిలోని 2,500 ఎకరాలు, కుమారి, కుఫ్టి, గాంధారి, గాజిలి, రాయదారి, మల్కలపాడు గ్రామాగ్రామాలు ముంపునకు గురికానున్నాయని తేల్చారు. 

40 వేల ఎకరాలకు సాగునీరు..

కుఫ్టి రిజర్వాయర్​తో భోథ్  నియోజకవర్గ ప్రజల తాగు, సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాలతో పాటు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాలకు దాదాపు 40 వేల ఎకరాలకు సాగు నీరందించవచ్చు. కానీ... ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ చేపట్టలేదు. భూములు ఇచ్చే రైతులను ఆఫీసర్లు కలవలేదు. ఫారెస్టు క్లియరెన్స్ లేదు. కనీసం భూసేకరణ కోసమైన నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు ఇతర అనుమతులు వచ్చే వరకు రైతులతో మాట్లాడి భూసేకరణ చేపడుతామని అధికారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో  ఏంచేయలేమని పేర్కొంటున్నారు.

ఎలాంటి ఆదేశాలు రాలె..

కుప్టి రిజర్వాయర్​కోసం గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 900 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో ఇటీవల కొత్త ప్రతిపాదనలు పంపించాం. ఫండ్స్​ రిలీజైతేనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. 

-  రాథోడ్ విఠల్, ఈఈ ఇరిగేషన్