
- నోబెల్ గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వాములు కావాలని నోబెల్ గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర భవిష్యత్విజన్ రూపకల్పనలో తన అనుభవాలను అందించాలన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన బెనర్జీ.. పోలీస్, మున్సిపల్ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల నియామకం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయాలను అభినందించారు.
శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టి వంటి అంశాలపై చర్చించారు.హైదరాబాద్ శతాబ్దాల చరిత్ర, ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త ఆదరణను బెనర్జీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతుల సాధికారత, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కళలు, చేతివృత్తులు, సృజనాత్మకతను భాగం చేయాలని సీఎంకు బెనర్జీ సూచించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కోర్సులు నిర్వహించాలన్నారు. అత్యాధునిక సాంకేతికత, సోషల్ మీడియా, మార్కెటింగ్ నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేయాలని సలహా ఇచ్చారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.