
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కమ్యూనిస్టుల పాత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నవతెలంగాణ 10 వార్షికోత్సవ సభలో మాట్లాడిన రేవంత్.. తనకు కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందన్నారు. 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో కమ్యూనిస్టుల పోరాటం ఉందని చెప్పారు.
ప్రజా ఉద్యమంలో ఎర్ర జెండా ఉన్నప్పుడే ప్రజలకు నమ్మకం ఉంటుందన్నారు సీఎం రేవంత్. అధికారంలో ఉన్నోళ్లను దింపడానికి కమ్యునిస్టులు ఉపయోగపడతారని చెప్పారు. పాలకుల తప్పులను ప్రశ్నించడానికి కమ్యునిస్టులు ముందుంటారని అన్నారు రేవంత్.
గతంలో జర్నలిస్టులు అంటే గౌరవం ఉందేదన్నారు రేవంత్. జర్నలిస్టులు చాలా మంది ప్రజల కోసం పనిచేశారని చెప్పారు. కానీ ప్రస్తుత సమాజంలో జర్నలిజం తీరు మారుతోందన్నారు. రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్టే..జర్నలిస్టుల విశ్వసనీయత తగ్గుతోందన్నారు. సోషల్ మీడియాలో విపరీత దోరణలు పెరుగుతున్నాయన్న రేవంత్... చాలా అంశాలపై మాట్లాడాలంటే ముందు జర్నలిస్టులతో చర్చించే వాళ్లమని చెప్పారు. విద్యుత్ అంశాలపై సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి నోట్ చేసుకునేదన్నారు.ప్రభుత్వ పథకాల తప్పిదాలను విశ్లేషించి రాయాలని సూచించారు రేవంత్. పాలనలో పట్టుకోసం విశ్లేషణాత్మక కథనాలను చదవాలన్నారు. అబద్దపు పునాదులపై రాజకీయం నిర్మించుకుంటే అది త్వరలోనే కూలుతుందన్నారు సీఎం రేవంత్.