విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా.. తెలంగాణ బ్రాండింగ్‌‌

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా.. తెలంగాణ బ్రాండింగ్‌‌
  • గతం.. వర్తమానం..భవిష్యత్తును ప్రచారం చేయాలి
  • ఫారిన్‌‌ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించాలి: సీఎం రేవంత్​రెడ్డి 
  • గతం.. వర్తమానం.. భవిష్యత్తును తెలియజేసేలా ప్రచారం ఉండాలి
  • రామప్ప నంది, సమ్మక్క-సారక్క, పీవీల ఘనతను చాటాలి
  • ‘తెలంగాణ రైజింగ్‌‌’ సమిట్‌‌పై సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం
  • నేటి నుంచి 30 వరకు శాఖలవారీగా మంత్రులతో సీఎం వరుస సమీక్షలు

హైదరాబాద్​, వెలుగు:అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు  హైదరాబాద్‌‌‌‌ను గమ్యస్థానంగా నిలపాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా ఫారిన్‌‌‌‌ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర బ్రాండింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో భార‌‌‌‌త్ ఫ్యూచ‌‌‌‌ర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబ‌‌‌‌ల్ స‌‌‌‌మిట్’ ఏర్పాట్లపై మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించి.. వాటిలో పలు కీలక మార్పులను సూచించారు.

ప్రచారంలో ప్రముఖులను హైలైట్​ చేయాలి..

తెలంగాణ బ్రాండింగ్‌‌‌‌ అనేది కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు.


చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలతోపాటు ప్రముఖులను ప్రచారంలో వినియోగించుకోవాలని సూచించారు.  మన రాష్ట్రానికే ప్రత్యేకమైన రామప్ప ఆలయంలోని నంది, సమ్మక్క -సారక్క జాతర వైభవం, నల్లమల పులులు, మహబూబ్‌‌నగర్ జిల్లా ప్రత్యేకత​అయిన ఎద్దులులాంటి అంశాలకు బ్రాండింగ్‌‌లో చోటు కల్పించాలని ఆదేశించారు. 

అలాగే,  తెలంగాణ గడ్డ నుంచి ఎదిగి జాతీయ రాజకీయాలను శాసించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావులాంటి దిగ్గజాలు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న తెలుగు ప్రముఖులను హైలైట్ చేయాలని సూచించారు.

వనరులు, వసతులపై సమగ్ర వివరణ

భార‌‌త్ ఫ్యూచ‌‌ర్ సిటీలో వివిధ విభాగాల వారీగా చేపడుతున్న పనులను, మౌలిక వసతులను ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్‌‌కు మణిహారాలైన ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్డు, ఓఆర్ఆర్‌‌‌‌,  త్వరలో రాబోయే రీజిన‌‌ల్ రింగ్‌‌ రోడ్డు (ట్రిపుల్‌‌ఆర్)తోపాటు మచిలీపట్నం పోర్ట్ వ‌‌ర‌‌కు నిర్మించ‌‌నున్న గ్రీన్‌‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్‌‌లాంటి అనుకూల అంశాలను ఇన్వెస్టర్లకు వివరించాలని సూచించారు. 

ఇక్కడి వాతావరణ అనుకూలత, మానవ వనరుల గురించి తెలియజేయాలని చెప్పారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా.. పారిశ్రామిక విధాన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదన్న విషయాన్ని, పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందన్న అంశాన్ని బలంగా  చెప్పాలని సీఎం సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వేదికలను బ్రాండింగ్ కోసం సమర్థంగా వాడుకోవాలని అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి వరుస సమీక్షలు..

గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ఈ నెల 26 నుంచి 30 వరకు  వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్‌‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించి.. ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నవంబర్‌‌ 26న లాజిస్టిక్స్‌‌, ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌గౌడ్‌‌, సీతక్కతో సీఎం భేటీ కానున్నారు. 

నవంబర్‌‌ 27న మౌలిక వసతులు, అభివృద్ధిపై మంత్రులు వివేక్‌‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌‌‌‌గౌడ్​, సీతక్క, అజారుద్దీన్‌‌, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డితో సమీక్ష నిర్వహించనున్నారు.  నవంబర్‌‌ 28న సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ, యువజన సంక్షేమంపై మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్‌‌ వెంకటస్వామితో.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు టూరిజంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో సీఎం సమావేశమవుతారు. 

నవంబర్‌‌ 29న సాయంత్రం 4 గంటలకు వ్యవసాయంపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు, ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి, వాకిటి శ్రీహరితో.. సాయంత్రం 6 గంటలకు సంక్షేమ విభాగాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌గౌడ్​, సీతక్క, అజారుద్దీన్‌‌తో రివ్యూ నిర్వహిస్తారు. చివరగా నవంబర్‌‌ 30న వైద్యారోగ్య రంగం ఏర్పాట్లపై మంత్రి దామోదర రాజనర్సింహతో సీఎం చర్చించనున్నారు.