బెర్తులు ఖరారు ..  మంత్రులకు శాఖలు కేటాయింపు

బెర్తులు ఖరారు ..  మంత్రులకు శాఖలు కేటాయింపు
  • సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్, ఎడ్యుకేషన్, మరికొన్ని 
  • అనుభవం ఉన్న మంత్రులకు కీలక డిపార్ట్​మెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రులకు శాఖలను సీఎం రేవంత్‌ రెడ్డి కేటాయించారు. కొన్ని ముఖ్యమైన శాఖలు తన వద్ద ఉండగా.. మరిన్ని కీలక డిపార్ట్ మెంట్లను సీనియర్ ఎమ్మెల్యేలు, గతంలో మంత్రులుగా పని చేసినోళ్లకు అప్పగించారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), హోం, లా అండ్ ఆర్డర్, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్​అర్బన్​డెవలప్​మెంట్, ఎడ్యుకేషన్, కమర్షియల్ ​ట్యాక్సెస్, స్టాంప్స్ ​అండ్​రిజిస్ర్టేషన్స్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వెల్ఫేర్, మైన్స్ అండ్ ​జియాలజీ, న్యాయ, కార్మిక, పశుసంవర్థక శాఖలతో పాటు మంత్రులెవరికీ కేటాయించని ఇతర డిపార్ట్​మెంట్లను సీఎం తన వద్ద ఉంచుకున్నారు.

మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉన్నందున, అందులో నుంచి కొన్ని శాఖలను వారికి కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులకు కేటాయించిన శాఖలపై సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సీనియర్లను తక్కువ చేశారనే అభిప్రాయం వ్యక్తం కాకుండా రేవంత్ శాఖల కేటాయింపు చేశారు. ఏ శాఖ ఎవరికిద్దామనే దానిపై హైకమాండ్​తో సుదీర్ఘంగా చర్చించి, ఓకే అన్నాకే మంత్రులకు శాఖలను కేటాయించారు. 

ఎవరికి ఏ శాఖ ఇచ్చారంటే.. 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఫైనాన్స్​తో పాటు ప్లానింగ్, విద్యుత్​శాఖ కేటాయించారు. ఆయనకు గతంలో డిప్యూటీ స్పీకర్​గా పని చేసిన అనుభవం ఉన్నది. మంత్రి శ్రీధర్ బాబుకు ఐటీ, ఇండస్ర్టీస్​తో పాటు శాసనసభ వ్యవహారాలు అప్పగించారు. ఆయన గతంలో ఉన్నత విద్యాశాఖ, సివిల్ సప్లయ్స్ మంత్రిగా పని చేయడంతో పాటు శాసనసభ వ్యవహారాలు చూశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్​తో పాటు ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్స్ శాఖ కేటాయించారు. గతంలో ఉత్తమ్ ​హౌసింగ్ మినిస్టర్​గా పని చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహకు వైద్యారోగ్య శాఖతో పాటు సైన్స్ ​అండ్ ​టెక్నాలజీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. కోమటిరెడ్డికి గతంలో ఐటీ, స్పోర్ట్స్, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నది.

మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుకు వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ ​అండ్ ​టెక్స్​టైల్స్ శాఖలు అప్పగించారు. తుమ్మల బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో ఆర్​అండ్​బీ మినిస్టర్​గా పని చేశారు. అంతకంటే ముందు టీడీపీ హయాంలోనూ ఆయన మంత్రిగా ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్​ కల్చర్, ఆర్కియాలజీ శాఖలు ఇచ్చారు. జూపల్లి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ శాఖలన్నీ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రే చూడగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే జిల్లాకు చెందిన మంత్రికి అప్పగించింది.

మంత్రి పొన్నం ప్రభాకర్​కు ట్రాన్స్​పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖలు కేటాయించారు. మొదటిసారి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి రెవెన్యూ, హౌసింగ్​తో పాటు సమాచార, పౌర సంబంధాల శాఖ ఇచ్చారు. మహిళా మంత్రుల్లో కొండా సురేఖకు ఎన్విరాన్​మెంట్​అండ్​ ఫారెస్ట్​తో పాటు దేవాదాయ శాఖ ఇచ్చారు. సురేఖ గతంలో వైఎస్ ప్రభుత్వంలో వుమెన్ అండ్​చైల్డ్ ​వెల్ఫేర్ ​మంత్రిగా పని చేశారు. మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన సీతక్కకు పంచాయతీరాజ్​అండ్​ రూరల్ ​డెవలప్​మెంట్, వాటర్ ​సప్లై, వుమెన్ ​అండ్ ​చైల్డ్ వెల్ఫేర్ శాఖలు అప్పగించారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్​రావు పంచాయతీరాజ్​శాఖను చూడగా, ఇప్పుడు అదే జిల్లాకు చెందిన సీతక్కకు దక్కింది.