- జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపు
- లొంగిపోయిన మావోయిస్టులకు ‘గిరి దర్శక్ గైడ్’గా శిక్షణ
- 20 మందికి నియామక పత్రాలను అందించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జనజీవన స్రవంతిలో చేరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టులను ‘గిరి దర్శక్ గైడ్స్’గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 20 మంది మాజీ మావోయిస్టులకు(ట్రైబల్స్) శిక్షణ ఇచ్చారు. వీరికి మంగళవారం నిర్వహించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గణపతి ఆరోగ్యం బాగా లేదని తెలిసింది.
లొంగిపోతే అవసరమైన వైద్యం, భద్రత కల్పిస్తం. ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇంకెవరైనా మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నా అంతా జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగిపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం. అభివృద్ధిలో భాగస్వాములను చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్టు. ఇప్పటికైనా వారంతా జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్యం, భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
పునరావాసం, జీవనోపాధి కోసం ‘గిరి దర్శక్ గైడ్’
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథ కం కింద వారికి జీవనోపాధి కల్పించేందు కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎస్‌ఐబీ చీఫ్ సుమతి నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు ఎస్పీ ఆయా జిల్లాల్లోని 20 మందికి గిరి దర్శక్ గైడ్స్‌గా ట్రైనింగ్ ఇచ్చారు. వీరిని ఫారెస్ట్, టూరిజం, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్లలో నియమించనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.10 వేల జీతం, ప్రత్యేక యూనిఫామ్ ఏర్పాటు చేశారు. వీరంతా భద్రాచలం, కిన్నెరసాని, ములుగు, కర్రెగుట్టల్లో పర్యాటకులకు సాయంగా ఉండనున్నారు.

