వచ్చే ఏడాదికల్లా పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి... సీఎం రేవంత్​

వచ్చే ఏడాదికల్లా  పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి... సీఎం రేవంత్​
  • కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్​కు గ్రీన్ చానెల్ ద్వారా నిధులు ఇస్తం
  • ప్రతి నెలా రివ్యూలతో పనులు స్పీడప్​ చేయండి
  • గ్రామాలు, మండలాల వారీగా ఆయకట్టు వివరాలివ్వండి
  • రిజర్వాయర్ల కెపాసిటీ పెంపుపై ప్రపోజల్స్​ రెడీ చేయండి
  • నియోజకవర్గాల్లో డిగ్రీ, మండలాల్లో ఇంటర్ కాలేజీలు, జీపీల్లో ప్రభుత్వ బడులు ఉండాలి
  • రూ.396 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 
  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, విద్య, వైద్యంపై రివ్యూ 
  • కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్​కు గ్రీన్ చానెల్ ద్వారా నిధులు ఇస్తం: సీఎం రేవంత్​

మహబూబ్​నగర్, వెలుగు: వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని, ప్రతి నెలా ప్రాజెక్టులపై రివ్యూలు నిర్వహించి పనులు స్పీడప్​చేయాలని సీఎం రేవంత్​రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీం (ఎంజీకేఎల్​ఐ)కు గ్రీన్ చానెల్ ద్వారా నిధులు అందిస్తామని ప్రకటించారు.

మంగళవారం మహబూబ్​నగర్ కలెక్టరేట్​లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్​చార్జ్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పర్యాటకంపై ఎంపీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు సీఎం రూ.396.09 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఐడీవోసీలో మహిళా శక్తి క్యాంటీన్​ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.334 కోట్ల రుణాలను అందించారు.

ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు చర్చించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పెండింగ్ పనులను 2025 డిసెంబరులోగా పూర్తి చేయాలని సీఎం ఇరిగేషన్ ఆఫీసర్లకు డెడ్​లైన్ విధించారు. ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్​ను రూపొందించాలన్నారు. గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు.

ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్ష చేయాలని, అదే రోజు తుది అప్రూవల్ తీసుకోవాలన్నారు. నెట్టెంపాడు స్కీం మొత్తాన్ని మరోసారి ఎగ్జామిన్ చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలను గుర్తించాల్ననారు. ఈ ప్రాజెక్ట్ పూర్తికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని నిధులు కావాలో స్పష్టంగా తెలపాలన్నారు. దీనిపై ఇరిగేషన్ మంత్రితో చర్చించి తుది ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.

ఆర్డీఎస్​కు సంబంధించి కర్నాటక, ఏపీ రాష్ట్రాలతో చర్చించాల్సిన విషయాలు, పరిష్కరించాల్సిన అంశాలను గుర్తించాలన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పూర్తికి ఏం కావాలో, ఆర్డీఎస్​పై కొత్త ప్రతిపాదనకు ఏం అవసరమో ఆలోచించి ప్రతిపాదించాలన్నారు. -అలాగే ఆర్అండ్ఆర్ సమస్య లేకుండా కోయిల్​సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ పెంపుపై పరిశీలించాలన్నారు. ప్రస్తుతం డిజైన్ చేసిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించేందుకు స్పష్టమైన ప్రతిపాదన తయారు చేయాలన్నారు. ఈ రిజర్వాయర్ కింద హజిలాపూర్, చౌదర్​పల్లి, నాగిరెడ్డిపల్లి లిఫ్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.

కాగా, 2025 డిసెంబరు నాటికి కోయిల్​సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంజనీర్లు సీఎంకు హామీ ఇచ్చారు. భీమా లిఫ్ట్1 పరిధిలో ఖానాయపల్లి ఆర్అండ్ఆర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోయిన వారికి పునరావాస కల్పనలో జాప్యం చేయొద్దని ఆదేశించారు. ‘పాలమూరు’ స్కీం కింద భూసేకరణ చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ బిల్లులను రెండో ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఫ్యూచర్​లో న్యాయపరమైన వివాదాలు రాకుండా చూడాలన్నారు. మండలం, గ్రామం వారీగా ఆయకట్టు వివరాలను రూపొందించాలన్నారు.

ప్రతి ప్రాజెక్టుకు స్టేటస్ రిపోర్ట్ ఉండా లని, అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరులోని అన్ని ప్రాజెక్టుల కిం ద ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ల  సామ ర్థ్యాన్ని పెంచే విషయాన్ని ప్రతిపాదనలతో వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

గ్రామీణ డాక్టర్లకు ప్రోత్సాహకాలు!

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం మాట్లాడుతూ అన్ని మండలాల్లో వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో లేదో రిపోర్టు ఇవ్వాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఏరియా ఆసుపత్రులపై వివరాలు సమర్పించాలన్నారు. అన్ని ఆసుపత్రులు, కాలేజీలు ఒకే చోట ఉండరాదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పని చేసే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం ఆలోచింస్తామన్నారు.

సమీక్షలో ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, అనిరుధ్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్ రెడ్డి, పర్ణికా రెడ్డి, తుడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజే యుడు, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.

బడులు తప్పనిసరిగా తనిఖీ చేయాలె

ప్రభుత్వ స్కూళ్లపై నిర్వహించిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయతీలలో తప్పనిసరిగా సర్కార్ బడి ఉండి తీరాలన్నారు. అన్ని మండలాల్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయా లేదా? లేకుంటే కాలేజీ ఏర్పాటు చేస్తే స్టూడెంట్లకు మేలు కలుగుతుందో లేదో ఆలోచన చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఉండాలని, లేకుంటే ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పరిశీలించాలన్నారు.

పార్లమెంటు స్థానం యూనిట్ ఆధారంగా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం ఉందా లేదా? మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీ ఉందా? లేదా? వివరాలు సమర్పించాలన్నారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో తప్పనిసరిగా ప్రతిరోజూ అరపూట బడులు తనిఖీ చేసి, కలెక్టర్​కు నివేదించాలన్నారు. కలెక్టర్ వారంలో ఒక రోజు బడులను విజిట్ చేయాలని, విజిట్ చేసిన సమయంలో ఏ బడిలోనైనా టీచర్ లేకపోతే తప్పనిసరిగా చర్య తీసుకోవాలని ఆదేశించారు.

విద్య శాఖలో అందరికీ ప్రమోషన్లు, బదిలీలు చేశామని, మీ బాధ్యతను మీరు నెరవేర్చాలని, ఇకపై తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. సెక్రటేరియెట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఉద్యోగుల హాజరు కోసం ఫేస్ రికగ్నేషన్ యాప్స్ పెడతామన్నారు. పైలెట్ పద్ధతిలో మహబూబ్​నగర్ జిల్లాలో అమలు చేయాలని, మంచి ఫలితాలొస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు.