
- రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకతిన్నరు..
- ఇప్పుడు ఆ చాన్స్లేక ఆగమైతున్నరు
- కేసీఆర్ కడుపు నిండా విషం.. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నడు
- కాంగ్రెస్ ఎందుకు విలన్ అయింది.. తెలంగాణ ఇచ్చినందుకా?
- అసెంబ్లీకి, ప్రజల మధ్యకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?
- కాళేశ్వరం, రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కుల గణన, ఉద్యోగాల భర్తీపై
- చర్చకు సిద్ధమా? అని సవాల్.. బసవేశ్వర జయంతి సభకు హాజరు
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల మధ్యకు కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. కొట్లాడి సాధించిన తెలంగాణను మొదటి పదేండ్లు కోతుల గుంపుకు అప్పగించినట్లు అయిందని, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఆగమైందని కేసీఆర్ అంటున్నడు. ఆగమైంది తెలంగాణ కాదు.. ఆయన ఫ్యామిలీ. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు. ఇప్పుడు దోచుకోవడానికి అవకాశం లేదని ఆగమైతున్నరు” అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఉద్యోగాల భర్తీ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం బసవేశ్వర జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఫామ్‌హౌస్‌లో ఉన్న పెద్దాయనకు చెప్తున్నా.. రాబోయే పదేండ్లు మేమే పరిపాలన చేస్తం. నువ్వు ఫామ్‌హౌస్‌లోనే ఉంటవ్. ఆ తర్వాత అక్కడే నీ చరిత్ర ముగుస్తుంది” అని అన్నారు. కడుపు నిండా విషం పెట్టుకొని ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. ‘‘ప్రతిపక్షం బలంగా ఉండాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని కోరుతూ కేసీఆర్ సభలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది.
అయినా.. ఆయన మాత్రం విద్వేషపూరిత ప్రసంగాలతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నడు. ప్రజలు విజ్ఞులు. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరి ఆలోచన ఎలా ఉందో ప్రజలకు తెలుసు” అని పేర్కొన్నారు. ‘‘100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టు.. వరంగల్ సభలో పాపాలు కడిగేసుకున్నట్లు కేసీఆర్ భావిస్తున్నడేమో! కానీ, కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించి 101వ పాపం చేసిండు” అని ఆయన అన్నారు.
చర్చకు సిద్ధమా?
‘‘కాంగ్రెస్‌ను ఆయన(కేసీఆర్) విలన్ అంటున్నడు. ఎట్ల విలన్ అవుతుందో చెప్పాలి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. "కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే.. ఆ తెలంగాణలో పదేండ్లు నువ్వు సీఎంగా ఉన్నవ్. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధిపొందినవ్. అందుకా కాంగ్రెస్ విలన్ అయింది?” అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కుల గణన, ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
‘‘ఆగిందంటున్నడు? ఏమాగింది.. రైతుభరోసా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదీ ఆగలేదు. ఆడబిడ్డలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తుంటే ఆయన విషం వెళ్లగక్కుతున్నడు. సంక్షేమం గురించి ఆయనకు అర్థమే కాదు.. ఎందుకంటే ఆయన అసెంబ్లీకే రాడు. అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏ బాధ్యత లేని ఆయన మమ్మల్ని విమర్శించడం ఏమిటి?” అని రేవంత్ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య విలువలు కాపాడుతం
‘‘బసవేశ్వరుడు, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలు సమాజంలో సమూల మార్పులు తెచ్చాయి. ఈ స్ఫూర్తితో గ్రామసభలు, పంచాయతీ రాజ్, పార్లమెంటరీ వ్యవస్థలను రూపొందించుకున్నాం" అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో బసవేశ్వరుడి వచనాల స్ఫూర్తితో ప్రజల కోసం పని చేస్తున్నామని, వీరశైవ లింగాయత్ సమాజం తనకు అండగా నిలిచిందని, కొడంగల్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి వారి మద్దతు కీలకమని ఆయన పేర్కొన్నారు. రూ.5,000 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించామని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీతో తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ‘‘ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ముఖ్యమంత్రిగా తాను వస్తున్నానని.. ఇదే రవీంద్రభారతీల ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నానని చెప్పారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్నారు.
ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం అమలు చేస్తానని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ సమాజం మా కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నది. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నూటికి నూరు శాతం శక్తితో పని చేస్త” అని చెప్పారు. విద్యార్థులు రాష్ట్ర భవిష్యత్తు అంబాసిడర్లుగా మారాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గ్రామాల్లో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
కుట్రలు పన్నేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి
ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేసీఆర్ అనడాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. “బసవేశ్వరుడి స్ఫూర్తితో స్కీములు తీసుకొస్తే వైఫల్యమా? జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ ఆదర్శాలతో కులగణన చేపట్టడం, రుణమాఫీ చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయమా?” అని ఆయన ప్రశ్నించారు.
కుట్రలు పన్నే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. బసవేశ్వరుడి ఆలోచనల స్ఫూర్తితో ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, అధికారాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ‘‘బసవేశ్వరుడు, ఫూలే, అంబేద్కర్ ఆదర్శాలను మా ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్నది. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజా పాలన కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నాం” అని వివరించారు.
ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా?
ప్రతిపక్ష నాయకుడిగా 16 నెలల నుంచి జీత భత్యాలు, బంగ్లా, కారు, పోలీసు భద్రత తీసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించకుండా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ దాక్కుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘65 లక్షల రూపాయల జీతం తీసుకున్నవ్. ఏ చట్టం ప్రకారం ఇలా ఇంట్లో కూర్చొని వసతులు అనుభవిస్తున్నవ్? కష్టం ఫలితాలిస్తుందని బసవేశ్వరుడు చెప్పిండు.. మరి నువ్వు ఎందుకు ప్రజల కోసం శ్రమించడం లేదు?” అని కేసీఆర్‌ను నిలదీశారు. ‘‘అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా, విద్వేషపూరిత ప్రసంగం చేస్తే రాష్ట్రానికి మంచిదా?’’ అని ప్రశ్నించారు.
‘‘తెలంగాణ ఆగమైందని అంటున్నడు.. ఏం ఆగమైంది? నీ కుటుంబం దోపిడీ ఆగిపోయిందేమో.. ఇంకో పదేండ్లు దోచుకుందామన్న నీ ప్రణాళిక అర్ధంతరంగా ఆగిపోయిందేమో!” అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఓడించినా, దొడ్డిదారిన తిరిగి చట్టసభల్లోకి తెచ్చపుకున్నారని, అందుకే ప్రజలు వారిని అధికారం నుంచి దించేశారని అన్నారు. వరంగల్ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ తన పేరు తీసుకునే ధైర్యం కూడా చేయలేదని, కాంగ్రెస్ కార్యకర్తల బలం దాన్ని బట్టి అర్థమైందని సీఎం రేవంత్ తెలిపారు.