గాయాలు మానలే.. కేసులూ పోలే.!

గాయాలు మానలే.. కేసులూ పోలే.!
  • దినమొక గండంగా  బతుకీడుస్తున్న నేరెళ్ల బాధితులు
  • తాజాగా హైకోర్టులో విచారణకు హాజరు
  • అసెంబ్లీలో సీఎం ప్రస్తావనతో మరోసారి చర్చ 

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  నేరెళ్ల ఘటనకు ఏడేండ్లు గడుస్తున్నా బాధితుల గాయాలు ఇంకా మానలేదు. ఇసుక మాఫియాకు అండగా నాటి ప్రభుత్వ పెద్దల కనుసైగతో రెచ్చిపోయిన పోలీసులు 8 మంది దళితులను ఐదు రోజులపాటు చిత్రవధ చేసిన సంగతి తెలిసిందే. నేటికీ ఆ పీడకల ఆ కుటుంబాలను వెంటాడుతోంది. ఇసుక లారీల కింద పడి  నలుగురు అమాయకులు చనిపోయినా పట్టని నాటి సర్కారు, ఆవేశంలో లారీలు తగలబెట్టిన పాపానికి నేరెళ్ల బాధితులపై కేసులు మోపింది. దీంతో బాధితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యయ, ప్రయాసలకు లోనవుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా నేరేళ్ల బాధితుల పక్షాన మాట్లాడడంతో సర్కార్ నుంచి ఆర్థిక, న్యాయ సాయం అందుతుందని ఆశిస్తున్నారు. 

నేరేళ్లలో అసలేం జరిగింది?

రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్​మానేరు జలాశయంలో ముంపునకు గురయ్యే  ప్రాంతంలో ఇసుకను తొలగించేందుకు మైనింగ్ శాఖ టెండర్లు నిర్వహించింది. తర్వాత చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల్లోని ఇసుక రీచ్ ల ద్వారా రోజూ వందలాది లారీలు, టిప్పర్ల  ద్వారా ఇసుక తరలించేవారు. ఈ క్రమంలో కొంతమంది డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలను నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. ఆరు నెలల్లోనే దాదాపు 42 వరకు యాక్సిడెంట్లు జరిగాయి. నలుగురు చనిపోయారు. 2017 జూలై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద బదనపురం భూమయ్య అనే రైతు మోపెడ్ పై వస్తుండగా ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే చనిపోయాడు. భూమయ్య నేరేళ్ల గ్రామానికి చెందిన రైతు. ఆయన చనిపోవడంతో గ్రామస్తులు, బంధువులు ఆగ్రహానికి గురై నేరెళ్ల వద్ద ఇసుక లారీలను తగులబెట్టారు. తంగళ్లపల్లి ఎస్ఐ సైదారావు లారీని తగులబెట్టకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు 8 మందిపై ఐపీసీ 307,506,341,448,435 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో పెంట బాణయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన భక్తుల మహేశ్, జిల్లెల్లకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్ లను అనుమానితులుగా అదుపులోకి తీసుకొన్నారు. ఐదు రోజుల తర్వాత జూలై 7న వారి అరెస్ట్ చూపారు. 

థర్డ్​ డిగ్రీ...రిమాండ్ ను తిరస్కరించిన జైలర్

పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని జూలై 8న రిమాండ్​కు తరలించగా అప్పటి కరీంనగర్ జైలర్ శివకుమార్ నిందితులపై గాయాలు చూసి రిమాండ్ కు నిరాకరించారు. నడవలేని స్థితిలో ఉండడంతో అనుమతించలేదు. దీంతో బాధితులకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన పోలీసులు..అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ సర్టిఫికెట్​తో జైలుకు తరలించారు. లోపలకు వెళ్లాక నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలులో డాక్టర్ వారిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని, కరీంనగర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలియడంతో ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిందితులను కలిసి మాట్లాడారు. కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితుల దగ్గరికి అప్పటి కాంగ్రెస్ లీడర్​, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాను తీసుకెళ్లి విషయం బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారు.  

40 రోజుల తర్వాత కేటీఆర్ పరామర్శ

ఎనిమిది మంది నిందితులకు ట్రీట్​మెంట్ ​కోసం కోర్టు జూలై 9 నుంచి 40 రోజుల పాటు కండీషన్​బెయిల్​ మంజూరు చేసింది. అది ముగిసిన తర్వాత రెండు రోజుల్లో పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. అయితే, కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగినా,  ఆయన 40 రోజుల తర్వాత వేములవాడలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ వారిని పట్టించుకోలేదు. ప్రస్తుతం అందరూ పని చేయలేని స్థితిలో ఉన్నారు. 20 రోజుల కింద బాధితుల్లో ఒకరైన కోలా హరీశ్​ప్రభుత్వం తమను ఆదుకోవాలని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపాడు. తాజాగా రెండు రోజుల కింద నేరేళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ జరగ్గా బాధితులు హాజరవ్వడం, అసెంబ్లీలో నేరేళ్ల ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  

రేవంత్ రెడ్డి పరామర్శ

 పోలీసుల దెబ్బలతో ఎనిమిది మంది బాధితులు దవాఖానలో చేరడంతో అప్పటి టీడీపీ లీడర్​, ప్రస్తుత  సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్​, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, ఇతర కాంగ్రెస్ నేతలు నేరేళ్లకు వెళ్లి బాధితులకు, వారి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అగ్రనేతల పరామర్శలు, డిమాండ్ల నేపథ్యంలో నిందితులను కొట్టిన ఎసై రవీందర్ ను సస్పెండ్ చేశారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటీని ట్రాన్స్​ఫర్​చేశారు.  

కచ్చితంగా ఆదుకుంటాం : ఆది శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్, వేములవాడ ఎమ్యెల్యే 

నేరేళ్ల బాధితులను తమ  సర్కారు ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, వేములవాడ ఎమ్యెల్యే -ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో నేరేళ్ల బాధితులను కలిసి మాట్లాడారు. బాధితుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు. అధైర్య పడొద్దని తామున్నామన్నారు.  

  ఈ సర్కారు న్యాయం చేస్తది ...

బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరెళ్ల బాధితులకు న్యాయం జరగలేదు. పోలీసుల థర్డ్ డిగ్రీ వల్ల ఎందుకూ పనికి రాకుండా పోయాం. అప్పటి మంత్రి కేటీఆర్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేరెళ్ల ఘటన గురించి మాట్లాడడంతో సంతోషం అనిపించింది. ఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఎస్సై రవీందర్, కొందరు కానిస్టేబుల్స్​పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించినప్పుడే మాకు న్యాయం జరిగినట్టు. ఈ ప్రభుత్వం అది చేస్తుందన్న నమ్మకం కలుగుతోంది.  
- కోల హరీశ్, బాధితుడు 

కోర్టుల చుట్టూ తిరగడానికి అప్పులు చేస్తున్నం  

నేరెళ్ల ఘటన విషయంలో ఆరేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నం. కోర్టుకు పోవడానికి, రావడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ వల్ల ఇప్పటికీ నా కాళ్లు సహకరించక పని చేయడం లేదు. దీంతో నాకున్న కొంత భూమిలో మా అల్లుడు వ్యవసాయం చేస్తుండడంతో కుటుంబం గడుస్తోంది. డాక్టర్లు నా కాలుకు ఆపరేషన్ చేయాలని అన్నరు. కానీ, బతకడానికే పైసలు లేవు..ఇగ ఆపరేషన్​ ఎట్లా చేయించుకునుడు. బీఆర్​ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదు. కాంగ్రెస్ సర్కారు న్యాయం చేయాలె.  
- పెంట బాణయ్య, నేరెళ్ల బాధితుడు.