ఎస్సీ గురుకులాల్లో సోషల్ మీడియా సెల్..వెల్ఫేర్ తెలంగాణ’ పేరుతో అకౌంట్లు

ఎస్సీ గురుకులాల్లో సోషల్ మీడియా సెల్..వెల్ఫేర్ తెలంగాణ’ పేరుతో అకౌంట్లు
  •     సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు..‘వెల్ఫేర్ తెలంగాణ’ పేరుతో అకౌంట్లు
  •     అచీవ్ మెంట్లు, సక్సెస్ స్టోరీలు, పాజిటివ్, నెగిటివ్ వార్తలపై రిపోర్టులు
  •     జిల్లా, స్టేట్ లెవల్‌‌‌‌లో సెల్ కార్యకలాపాలు
  •     జిల్లాల్లో జాయింట్ సెక్రటరీకి సెల్ నిర్వహణ బాధ్యతలు

హైదరాబాద్ , వెలుగు: సంక్షేమ శాఖల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని గురుకులాల్లో ‘వెల్ఫేర్ తెలంగాణ ’ పేరుతో  రాష్ట్ర, జిల్లాస్థాయిలో సోషల్ మీడియా సెల్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని  అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు తగ్గట్టుగా ఎస్సీ గురుకులాల్లో సోషల్ మీడియా సెల్‌‌‌‌ను సొసైటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.  అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రస్థాయిలో కూడా ఈ సెల్ పనిచేయనున్నది. రాష్ట్రస్థాయిలో ఈ సెల్‌‌‌‌కు చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా జాయింట్ సెక్రటరీస్థాయి అధికారి, జిల్లాస్థాయిలో డీసీవో ( డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ ) వ్యవహరించనున్నారు. ప్రతి జిల్లాల్లో ఇద్దరు అధికారుల చొప్పున 66 మందిని ఈసెల్‌‌‌‌లో నియమించారు. జిల్లాస్థాయి కమిటీలో ఐదుగురు, రాష్ట్రస్థాయి కమిటీలో ఐదుగురు పనిచేయనున్నారు. వీరికి ఇటీవల ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఫ్యాకల్టీతో ట్రైనింగ్‌‌‌‌ను అధికారులు ఏర్పాటు చేశారు. గురుకులాలకు సంబంధించిన వార్తలు, సక్సెస్ స్టోరీలను ఎలా నిర్ణయించాలి? ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలపై జర్నలిజం ఫ్యాకల్టీ వివరించారు. 

సెల్ నిర్వహించే విధులివే..

ఎస్సీ గురుకులాలకు సంబంధించి జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో వచ్చే నెగిటివ్, పాజిటివ్ వార్తలు, గురుకులాల్లో స్టూడెంట్స్ అచీవ్‌‌‌‌మెంట్లు, సక్సెస్ స్టోరీలను ఈ మీడియా సెల్ రిపోర్ట్ రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నది. గురుకుల సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ,  లేదా స్పెషల్ సీఎస్, వెల్ఫేర్ మంత్రి , సీఎం, సీఎంవోకు అందజేయనున్నారు . వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రస్థాయిలో జేఎస్ తర్వాత  గురుకులాలపై కంటెంట్ రాసే డిగ్రీ లెక్చరర్‌‌‌‌‌‌‌‌, టెక్నికల్ సభ్యులు, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి ఒక మెంబర్‌‌‌‌‌‌‌‌ను కమిటీలో నియమించారు.

తప్పుడు ప్రచారాలపై రిపోర్ట్స్..

గురుకులాల్లో  ఫుడ్ పాయిజన్ ఘటనలు, గురుకుల అడ్మిషన్లు, అద్దె బకాయిలు, ఆత్మహత్యలు, స్టూడెంట్స్ పై వేధింపుల వార్తలు నిత్యం అన్ని గురుకులాల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఇతర కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నా, గురుకులాలకు సంబంధం లేకున్నా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి గురుకులాలకు అంటగడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు , విద్యార్థి సంఘాలు, అధికారులపై కోపం, ఇతర గొడవలు ఉన్నా .. పేరెంట్స్ కమిటీల లీడర్లు సైతం  ఇలాంటి ఘటనల్లో లీనమవుతున్నారు. చివరికి వీటిపై సీఎం, మంత్రులు స్పందించాల్సి వస్తున్నది. ఎన్పో ఏండ్ల తర్వాత డైట్ , కాస్మోటిక్ చార్జీలను ప్రజా ప్రభుత్వం పెంచింది. వీటితో పాటు గురుకులాలకు సంబంధించి బకాయిలను, అద్దెలను ఆలస్యం చేయకుండా గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక శాఖ రిలీజ్ చేస్తున్నది.   అన్ని గురుకులాలు ఒకే దగ్గర ఏర్పాటు చేసే దిశగా 25 ఎకరాల్లో  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ అన్ని అంశాలను  సోషల్ మీడియా సెల్‌‌‌‌లు రిపోర్టుల రూపంలో రెడీ చేసి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లనున్నాయి.