జూబ్లీహిల్స్ లో గెలువబోతున్నం..బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ లో గెలువబోతున్నం..బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి
  • అందరూ అప్రమత్తంగా ఉండండి
  • బీఆర్ఎస్ ఫేక్  ప్రచారాన్ని తిప్పి కొట్టండి
  • వాళ్లకు ఇప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలె
  • మనకు ఇక మిగిలింది మూడు రోజులే  
  • ప్రతి గంటనూ సద్వినియోగం చేయండి
  • పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలి
  • మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలువబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. మంత్రులు, పార్టీ నాయకులు అందరూ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సూచించారు. మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోజుకో సర్వేను వదులుతూ ప్రజలను, ఓటర్లను బీఆర్ఎస్ సోషల్ మీడియా గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఫీల్డ్ లో కాంగ్రెస్ కు బలం ఉందని, నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని, ఇవాళ్టి నుంచి ప్రతి గంటనూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఓటరుకు మన వాయిస్ చేరాలని అన్నారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేర్చే బాధ్యతను మంత్రులు, పార్టీ నాయకులు తీసుకోవాలని సూచించారు.  రాబోయే మూడు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై రివ్యూ చేశారు. 

పోలింగ్ శాతం పెంచాలి

ఈ సెగ్మెంట్ లో పోలింగ్ పర్సంటేజీ పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం ఈ రివ్యూలో సూచించినట్టు సమాచారం.   ఇక్కడ మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,08,561మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. వీళ్లంతా 139 పోలింగ్ కేంద్రాల్లోని  407 పోలింగ్ బూత్ లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదవుతోంది.ఇక్కడ 2009 లో 52.76%, 2014లో 50.18%, 2018లో 45.59% 2023లో 47.49% పోలింగ్ నమోదవుతోంది. దానిని పెంచడం, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రం వరకూ వచ్చేలా చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం చెప్పినట్టు  సమాచారం. దీంతో  పాటు బస్తీల వారీగా పరిస్థితిని కూడా సీఎం సమీక్షించినట్టు తెలుస్తోంది.