- యూఎస్ఐఎస్పీఎఫ్ సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
- హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నం
- ప్రపంచస్థాయి విద్యాసంస్థలకు ఆహ్వానం పలుకుతున్నం
- ‘చైనా ప్లస్ 1’ మోడల్‌కు తెలంగాణే సమాధానం
- సిటీలో రోడ్లకు టెక్ కంపెనీల పేర్లు పెడతామని ప్రకటన
న్యూఢిల్లీ, వెలుగు: భారత్‌లో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీసీసీలకు గ్యమస్థానమైన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉండడంతో పాటు భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు. అందువల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.
దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఇన్వెస్ట్‌మెంట్లకు తెలంగాణ అన్ని విధాలుగా అనువైందని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యూఎస్ఐఎస్పీఎఫ్) సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌పై ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న అంశాలను హైలైట్ చేయడంతో పాటు అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలమైన అంశాలు, ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం చేపడుతున్న గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, అమెరికన్ కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసే అంశాలను వివరించారు. ‘చైనా ప్లస్ 1’ మోడల్‌కు తెలంగాణ సమాధానంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అదే మా లక్ష్యం..
మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ప్రపంచస్థాయి విద్యాసంస్థలకు ఆహ్వానం పలుకుతున్నం. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది” అని చెప్పారు.
30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నం. ఇది దేశంలోనే నూతన నగరంగా మారుతుంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్ ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ ఎకానమీ పెరుగుతుంది. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు చేపట్టాం” అని వివరించారు.
ట్రెండ్ మార్చుతం..
భారత్‌లో రోడ్లకు ఎక్కువగా పొలిటికల్ లీడర్ల పేర్లు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఈ ట్రెండ్ మార్చాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇకపై సిటీలోని ప్రధాన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీ పేర్లను పెడతామని ప్రకటించారు.
సీఎం విజన్‌పై టెక్ దిగ్గజాల ప్రశంసలు..
సీఎం రేవంత్ రెడ్డి విజన్‌పై టెక్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనలను అభినందించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలన్న సీఎం విజన్ అన్ని కోణాల్లో స్పష్టంగా ఉందని కొనియాడారు. సదస్సులో సీఎం చేసిన ప్రసంగం, ప్రజంటేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను సీఎం వివరించిన తీరు అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.
గ్లోబల్ సమిట్‌కు హాజరవుతాం..
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు హాజరవుతాం. తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాం.
- డా ముఖేశ్ ఆఘి, యూఎస్ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు
సీఎం విజన్ క్లియర్
సీఎం రేవంత్ రెడ్డి విజన్ చాలా క్లియర్‌గా, సాధించే విధంగా ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. - జాన్ చాంబర్స్, సిస్కో మాజీ సీఈవో
