హామీలపై అసెంబ్లీలో చర్చిద్దామా.. బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

హామీలపై అసెంబ్లీలో చర్చిద్దామా..  బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారని నిలదీశారాయన. కేసీఆర్ ప్రభుత్వం, మోదీ సర్కార్.. గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా అని.. కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి, గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇచ్చిన హామీలు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, వాటి అమలు విషయంపై.. అసెంబ్లీలో చర్చించటానికి ప్రత్యేక సమాశాలు ఏర్పాటు చేస్తామని.. మీ రెండు పార్టీలు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటే అని.. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుందో.. వాటికి బీజేపీ వత్తాసు పలుకుతుందని ఎద్దేవ చేశారు. పదేళ్లుగా రెండు పార్టీలు కవల పిల్లలుగా ఉన్నాయని.. కేసీఆర్ చేసిన విధ్వంసంలో బీజేపీ పాత్ర లేదా అని ప్రశ్నించారాయన. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తుంటే.. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని బీజేపీ ఎప్పుడైనా ప్రశ్నించిందా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.  మోదీ ఇచ్చిన హామీలు, స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం తీసుకొచ్చే అంశం.. రైతులకు హామీలు, రెండు కోట్ల ఉద్యోగాలు ,మోదీ 2014, 2019 ఎన్నికల హామీలపై చర్చిద్దామా అంటూ  కిషన్ రెడ్డికి  సవాల్ విసిరారు.  

తెలంగాణ రాష్ట్ర సమస్యలపై ఏమైనా కేంద్రంతో చర్చించారా.. ప్రస్తావించారా.? అంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి.  కనీస మద్దతు ధర అడిగితే కాల్చి చంపుతున్నది మోదీ ప్రభుత్వం కాదా.. ఢిల్లీ సరిహద్దులో రైతులతో యుద్ధం చేస్తుంది ఎవరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కిషన్ రెడ్డికి ఏమీ తేడా లేదన్నారు. ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. నష్టం చేశారు..కిషన్ రెడ్డికి ప్రశ్నించే అర్హత లేదన్నారు