
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీడబ్ల్యూసీ భేటీకి ముందు తుగ్లక్ రోడ్లోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన నేరుగా సోనియా నివాసం జన్ పథ్ 10కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 10.45 గంటల వరకు ఈ భేటీ సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, సాధించిన సీట్లు, ఇతర అంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే, తాజా రాజకీయ పరిణామాలను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిఏటా డిసెంబర్ 9 న రాష్ట్రంలో ‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు వివరించారు. ప్రజాపాలనపై దృష్టి పెట్టే క్రమంలో కొత్తగా పార్టీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ ను నియమించే విషయంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. అలాగే, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్ణయాలపై వీరు చర్చించారు.
తుగ్లక్ రోడ్ నివాసానికి మారిన రేవంత్
తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా కేంద్రం కేటాయించిన తుగ్లక్ రోడ్ –23 నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి మారారు. సీఎం హోదాలో ఆయన ఈ క్యాంప్ ఆఫీసులోనే బస చేశారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి కేంద్రం.. యమునా బ్లాక్ (ఎంపీల క్వార్టర్స్) లోని 9 వ ఫోర్ల్ లో వసతి కల్పించింది. సీఎం అయిన తర్వాత కూడా ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి అక్కడే బస చేశారు. ఇటీవల ఇంటికి సంబంధించిన అన్ని మరమ్మతులు పూర్తికావడంతో తుగ్లక్ రోడ్ కు మారారు. కాగా, తుగ్లక్ రోడ్ లోని ఈ నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ దాదాపు 20 ఏండ్లు ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఈ నివాసంలోకి మారిన కేసీఆర్.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో దీన్ని విడిచిపెట్టక తప్పలేదు. అయితే, గత సీఎం ఈ నివాసం కోసం కోట్లు ఖర్చు చేస్తే..రేవంత్ రెడ్డి మాత్రం తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకున్నారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను మాత్రమే రేవంత్ పొందుతున్నారు.