- రాబోయే 8 నెలలు అత్యంత కీలకం
- తాగు, సాగునీరు, కరెంట్‌పై యాక్షన్ ప్లాన్
- రెడీ చేయాలని అధికారులకు ఆదేశం
- పంటలు చేతికొచ్చేదాకా నీటి కొరత రావొద్దు
- మరో 50 రోజులు ఉపాధి పని పరిస్థితుల పర్యవేక్షణకు వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్
- త్వరలో మంత్రుల ప్రత్యేక భేటీ..
- అవసరమైతే అఖిలపక్షం
హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో వల్ల సంక్షోభం పొంచి ఉందని, రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాబోయే 8 నెలల కాలం అత్యంత కీలకమని, ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు గ్రామ స్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ‘మన ముందు తీవ్ర ముప్పు పొంచి ఉన్నది.. దీనిని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తాగు, సాగు, కరెంట్ తదితర సమస్యలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి. ప్రతి కార్యాచరణలో వారిని భాగస్వాములుగా చేయాలి’ అని స్పష్టం చేశారు.
రాష్ట్ర అవసరాల కోసం ఎంత డబ్బయినా వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో కరెంట్ లభ్యత లేదన్నారు. రైతులు సాగు చేసిన పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, చేతికొచ్చిన పంటలను కాపాడాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, పొదుపు ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సినిమా, మీడియా, కళాజాతాలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
మంత్రులతో రేపటి భేటీ వాయిదా
ఎల్ నినో ఎఫెక్ట్‌పై సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. అతి త్వరలోనే మంత్రులతో ప్రత్యేక భేటీ ఏర్పాటుచేసి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కరువు మండలాలుగా ప్రకటించి, రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
వీబీజీ రామ్ జీ పథకంలో 125 రోజుల పనిదినాలకు అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని తెలిపారు. అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే అంశంపై మంత్రుల భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దసరా తర్వాత అన్ని స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను సీఎంవో ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు
ఎల్ నినో సంక్షోభం తీవ్రరూపం దాల్చకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పకడ్బందీ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలని, ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ప్రత్యేక కమిటీలు వేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. గ్రామాల్లో తాగునీటి కొరత, విద్యుత్ డిమాండ్, ఎండిపోతున్న పంటల వివరాలను ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఆ రిపోర్టుల ఆధారంగా ఆయా సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
