- నిర్బంధాన్ని ఛేదించుకొని జంతర్ మంతర్ వైపు యువత.. అడ్డుకోవడంతో ఎక్కడికక్కడే ధర్నా
- 90వేల మంది పోలీసుల మోహరింపు
- 7 వేల మంది అందోళన కారుల అరెస్ట్
- 25 గంటల పాటు మెట్రో బంద్.. 45 స్టేషన్లకు తాళం
- నిర్బంధంలో నలుగురు మాజీ సీఎంలు, ధ్రువ్ రాఠీ
- పోలీసు కస్టడీలో సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్ దాస్
- 24 గంటల్లో వదిలిపెట్టకుంటే దీక్ష: వాంగ్‌చుక్
- రాహుల్, కేజ్రీవాల్‌ల ‘బీ టీమ్’ సీజేపీ: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: మెట్రో గేట్లకు తాళాలు, ఇంటర్నెట్ బంద్, అడుగడుగునా పోలీసు బలగాలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనను అడ్డుకునేందుకు శనివారం దేశ రాజధాని మొత్తాన్నీ ప్రభుత్వం దిగ్బంధించింది. జంతర్ మంతర్ వైపు అడుగు వేసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు పట్టుకుని బస్సుల్లోకి ఎక్కించారు. ఇలా ఒక్కరోజే 7 వేల మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్ సర్కార్ వంటి నలుగురు మాజీ ముఖ్యమంత్రులూ వీరిలో ఉన్నారు. రాత్రికి అందరినీ విడిచిపెట్టినా సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ మాత్రం ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసన కారణంగా 45 మెట్రో స్టేషన్లలో 25 గంటల పాటు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాతే అన్ని స్టేషన్ల గేట్లను తెరిచినట్టు డీఎంఆర్‌సీ ప్రకటించింది.
అడ్డుకున్న చోటే జంతర్ మంతర్
సీజేపీ పిలుపుతో శనివారం జంతర్ మంతర్‌కు బయలుదేరిన యువత, ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులను ఉద్దేశించి సీజేపీ లీడర్ అజింక్య షిండే ఎక్స్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘పోలీసులు మిమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటే, అదే మీ జంతర్ మంతర్.. అక్కడే మీ నిరసనను చేపట్టండి’ అని సూచించారు. దీంతో నిరసనకారులు ఎక్కడికక్కడ బైఠాయించి నిరసన తెలిపారు.
ముండ్ల కంచెలు, బారికేడ్లు
90,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఢిల్లీలో మోహరించింది. సరిహద్దుల వద్ద స్పైక్ స్ట్రిప్స్, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేసింది. సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఎంలకు చెందిన పలువురు ప్రముఖ నేతలను కూడా జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో అంచెలంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పారామిలటరీ, పోలీసుల మోహరింపుతో సెంట్రల్ ఢిల్లీ ఒక రక్షణ బంకర్ లా మారిపోయింది. ఎంట్రీ పాయింట్ల వద్దే తమను అడ్డుకోవడంతో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహానికి లోనై పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టాయి.
రోడ్లపై మేకుల పట్టీలు
ఢిల్లీ సరిహద్దులను పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. బదర్‌పూర్ బార్డర్లో వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు రోడ్లపై ‘మేకుల పట్టీలు’ పరిచారు. నోయిడా-ఢిల్లీ సరిహద్దులోని చిల్లా చెక్‌పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ, డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. దీంతోపాటు, ఢిల్లీ మీదుగా వెళ్లే రైళ్లలో పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని దించేశారు. గత ఆందోళనల సమయంలో మహిళా పోలీసులకు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి ఢిల్లీ పోలీసులు పూర్తిగా మహిళా సిబ్బంది మాత్రమే ఉండే ‘పింక్ ఫోర్స్’ను మోహరించారు.
బస్సుల్లో తిప్పి.. స్టేషన్ల చుట్టూ చక్కర్లు
పోలీసులు తమను పట్టుకెళ్లిన తీరును మమత కళ్లకు కట్టినట్టు వివరించారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమను ముందుకు వెళ్లనివ్వకపోవడంతో ఇంటి ముందున్న బస్టాండ్‌లోనే కూర్చున్నామని ఆమె చెప్పారు. ముగ్గురు కూడా ఒక్కచోట ఉండొద్దని పోలీసులు
హుకుం జారీ చేశారని, దాంతో ముగ్గురేసి చొప్పున దూరం దూరంగా కూర్చున్నామని తెలిపారు. అయినా నిమిషంలోనే బలవంతంగా ప్రిజన్ వ్యాన్‌లోకి ఎక్కించారని, మోస్ట్ వాంటెడ్ నేరస్థుల్లా ఎత్తుకెళ్లారని మండిపడ్డారు.
రెండు గంటల పాటు రోడ్ల మీద తిప్పారని, ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు తీసుకెళ్తే ప్రతిచోటా 'జాగా లేదు' అనే సమాధానమే వచ్చిందని చెప్పారు. జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని, ఢిల్లీలో పరిస్థితి ఎమర్జెన్సీని మించిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. నగరం మొత్తాన్నీ మూసేశారని, ఇంటర్నెట్ బంద్ చేశారని, విద్యార్థులను పోలీసులు చితకబాదారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏమాత్రం భయపడొద్దని, నమ్మిన దాని కోసం నిలబడాలని, ప్రశ్నించడం ఆపొద్దని విద్యార్థులకు సందేశమిచ్చారు.
'బీ టీమ్' అంటూ ఢిల్లీ సీఎం విమర్శలు
విపక్షాల విమర్శలపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎదురుదాడికి దిగారు. రాజధానిని ఎవరూ బందీగా చేసుకోలేరని తేల్చిచెప్పారు. తమ 'బీ టీమ్' సీజేపీతో చేతులు కలిపి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ఢిల్లీని యుద్ధభూమిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరసనల సందర్భంగా జరిగిన తోపులాటల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను పట్టుకునే క్రమంలో తనను తోసేయడంతో గాయమైందని ఎస్సై బజరంగ్ జాధవ్ చెప్పారు.
నిర్బంధంలో మాజీ సీఎంలు
ఇండియా కూటమికి చెందిన పలువురు ఇతర నేతలనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మరో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్ సర్కార్. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, వామపక్ష సీనియర్ నేత బృందా కారత్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యను నిర్బంధించారు.
ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను కూడా అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్, జాతీయ మీడియా ఇన్‌చార్జ్ అనురాగ్ ధండా కూడా నిర్బంధానికి గురయ్యారు.
విపక్షమంటే భయమా: పినరయి
విజయన్ ఎక్స్ వేదికగా స్పందించారు. "విపక్షమంటే ఇంత భయమా? ప్రజాప్రతినిధులను ఢిల్లీ పోలీసులతో అదుపులోకి తీసుకోవాలా? వారి నోరు మూయించడానికి గంటసేపు వలయాల్లో తిప్పాలా? మోదీ భయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఇది సిగ్గుచేటు. ఇలాంటి నిరంకుశ చర్యలు మన ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి. కానీ మేం బెదిరిపోం" అని అన్నారు.
