- ఆర్టీసీలో రాష్ట్ర స్థాయి గుర్తింపు ఎన్నికల్లో టీడబ్ల్యూయూపై ఈయూ కూటమి ఆధిక్యత
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల్లో టీడబ్ల్యూయూపై ఈయూ కూటమి 4,580 ఓట్ల మెజార్టీ సాధించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగడంతో ఈయూ విజయం ఖాయమైనట్లు ఫలితాలు వచ్చినా, మెజార్టీ విషయంలో స్పష్టత రాలేదు. దీనిపై శనివారం ఆయా కార్మిక సంఘాలు సేకరించిన వివరాల అనంతరం ఈ మెజార్టీ నిర్ధారణ అయింది. అయితే, దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఈనెల 17న ఎన్నికల ఫలితాలను అధికారికంగా కార్మిక శాఖ ప్రకటించనుంది. ఈనెల 14, 15 తేదీల్లో కార్మికులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకోనున్నారు. అయితే, వాటి ప్రభావం గెలుపోటములపై ఏమాత్రం చూపకపోయినా, మెజార్టీలో స్వల్పంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక 11 రీజియన్లు, మూడు నాన్ ఆపరేటింగ్ యూనిట్లలో ఏ యూనియన్‌కు లోకల్ గుర్తింపు వచ్చిందనే విషయంలో కూడా ఈ నెల 17నే కార్మిక శాఖ ఫలితాలను వెల్లడించనుంది. శుక్రవారం రాత్రి జరిగిన కౌంటింగ్ నేపథ్యంలో ఏ యూనియన్‌కు ఏ రీజియన్‌లో లోకల్ గుర్తింపు దక్కిందనే విషయంలో యూనియన్లకు ఇప్పటికే స్పష్టత వచ్చింది.
గెలుపు వివరాలు ఇలా ఉన్నాయి...
మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో టీడబ్ల్యూయూ కూటమి విజయం సాధించింది. నాన్ ఆపరేటింగ్ యూనిట్లలో ఆర్టీసీ కేంద్ర కార్యాలయం యూనిట్లో టీడబ్ల్యూయూ గెలుపొందింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ లో ఈయూ కూటమి విక్టరీ సాధించింది. ఖమ్మంలో ఎస్ డబ్ల్యూఎఫ్ (టీడబ్ల్యూయూ కూటమి) గెలుపొందింది. వరంగల్, మెదక్, సికింద్రాబాద్‌లో ఏ కూటమికి ఆధిక్యం లభించలేదు. కాబట్టి ఈ మూడు రీజియన్లు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన కూటమి ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఇక నల్గొండ రీజియన్‌తో పాటు మరో రెండు నాన్ ఆపరేటింగ్ యూనిట్లలో ఏ కూటమి ఆధిక్యతను సాధించిందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి మెజార్టీ వివరాలు ఈనెల 17న అధికారికంగా కార్మిక శాఖ ఫలితాలను వెల్లడించనుంది.
