హైదరాబాద్ ,వెలుగు: ఏకపక్ష నిర్ణయాలతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటు హక్కును ప్రమాదంలోకి నెట్టిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) డిమాండ్ చేసింది.
శనివారం దోమలగూడలోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరాపార్కు ధర్నాచౌక్ వరకు టీచర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తొలగించి కేంద్ర మంత్రిని చేర్చడం ద్వారా అధికార పార్టీ తమకు అనుకూలమైన వ్యక్తులను కమిషనర్లుగా నియమించుకుందన్నారు.
ఆ క్రమంలోనే నియమితులైన జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం పట్ల స్వామిభక్తిని చాటుకునేందుకు తోటి కమిషనర్ల అభ్యంతరాలనూ పట్టించుకోకుండా ఫారమ్-6, సర్ నిబంధనలను మార్చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ముసుగులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే సీఈసీ వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు.
