- ఖమ్మంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
- హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ‘రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే మన బలం. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలి. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలి’ అని సూచించారు. శనివారం ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, రైతు భరోసా, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలు అమలవుతున్నాయని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలంటే పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక సీనియర్ నాయకుడిని ఇన్చార్జిగా నియమించి, వారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట అన్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలబోతున్నాయని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి తమ కుటుంబం పనిచేస్తోందన్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివినా, యూకే, కెనడా వంటి దేశాల్లో కార్పొరేట్ రంగంలో పనిచేసిన తాను సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తిరిగి వచ్చానని చెప్పారు.
