- జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే
- 12న ఢిల్లీలో భారీ ర్యాలీకి సన్నాహాలు
- జ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా వెనక్కు తగ్గం
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ శనివారం స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. సోమవారం ఢిల్లీలో చేపట్టనున్న నిరసన ర్యాలీలో పాల్గొనాలని ఇండియా కూటమి పార్టీలకు, "ఆందోళన చెందుతున్న పౌరులందరికీ" పిలుపునిచ్చింది. "మోదీ-షా ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాగిస్తున్న ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. భారత ప్రజాస్వామ్య మనుగడపై ఆందోళన ఉన్న ప్రతి భారతీయుడూ ఇందులో పాల్గొనాలని కోరుతున్నాం.
ఈ ర్యాలీ సన్నాహాల కోసం నిన్న పలువురు నేతలతో సమగ్రంగా సమావేశమయ్యాం. ఇండియా కూటమి ఎంపీలు, నేతలు, కార్యకర్తలు, పౌరులు 'జ్ఞానేశ్ అండ్ కో'కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపడతారు. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మా సీనియర్ నేతల బృందం గౌరవ సీజేఐకి వినతిపత్రం సమర్పిస్తుంది" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. "జ్ఞానేశ్ వెళ్లాల్సిందే. వెనక్కి తగ్గేది లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా శనివారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. మెడలో ప్లకార్డు ధరించి ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిరసనను అడ్డుకున్న తీరుపై మమత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నిర్బంధాన్ని కిడ్నాప్‌తో పోల్చారు. "ఇది చాలా దురదృష్టకరం. మేం నేరస్థులం కాదు. కానీ నేరస్థుల్లా మమ్మల్ని ఎత్తుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా రెండు గంటల పాటు తిప్పారు. అచ్చం కిడ్నాప్‌లానే ఉంది. ఇప్పుడు హరియాణా-ఢిల్లీ సరిహద్దులో ఉన్నాం" అని ఆమె అన్నారు.
కోల్‌కతా ప్రయాణం రద్దు చేసుకున్న మమత
రాహుల్ గాంధీ కోరడంతో కోల్‌కతా విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు మమత తెలిపారు. ఆయన విజ్ఞప్తి మేరకే ఢిల్లీలో ఉంటున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే రాహుల్‌ను ప్రధాని పదవికి ఆమె సమర్థించిన సంగతి తెలిసిందే. "ఇది ఎమర్జెన్సీని మించిపోయింది. సూపర్ ఎమర్జెన్సీగా మారింది. శాంతిని కాపాడటం, సంయమనం పాటించడం అత్యంత ముఖ్యం. కానీ ఈరోజు వాళ్లు చేస్తున్నది దేశానికి గానీ, ప్రజలకు గానీ మంచిది కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు.
