శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దు: యూఎన్

శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దు: యూఎన్
  • సీజేపీకీ మద్దతుగా కామెంట్.. కౌంటర్ ఇచ్చిన భారత్

జెనీవా: ‘ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనలకు తప్పనిసరిగా చోటు ఉంటుందని, దానిని గౌరవించాలని’  ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన సందర్భంగా భారీ సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలపై యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. అరెస్టు చేసిన నిరసనకారులను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

ఈమేరకు యూఎన్ హెచ్చార్సీ అధికార ప్రతినిధి థమీన్ అల్ ఖేతన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఢిల్లీలో భారీ ఎత్తున తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం సందర్భంగా పలు వర్గాలకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ఈ హక్కును అడ్డుకోవడం సరికాదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ.. నిరసనకారులను బేషరతుగా, వెంటనే విడుదల చేయాలి’ అంటూ ఖేతన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

తిప్పికొట్టిన భారత్

హ్యూమన్ రైట్స్ కమిషనర్ ట్వీట్‌కు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ స్పందించింది. ఢిల్లీలో నిరసనకారుల అరెస్టు వ్యవహారం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. ఇందులో ఇతరుల జోక్యాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. శాంతియుత నిరసనలకు భారత రాజ్యాంగం పెద్ద పీట వేసిందని, దానిని అమలుచేసేందుకు తగిన వ్యవస్థ కూడా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత్ లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే మీడియా ఉందని గుర్తుచేసింది. ప్రపంచంలోని ప్రతీ ప్రజాస్వామ్య దేశాల్లోలాగే భారత పౌరులు కూడా షరతులకు లోబడి ఈ నిరసన హక్కును ఉపయోగించుకుంటారని పేర్కొంది.