బోనస్, అడ్వాన్స్ ఇయ్యాలంటే అప్పు చేయాల్సిందే..! గత ప్రభుత్వం తీరుతో ఆగమైన సింగరేణి.. 

బోనస్, అడ్వాన్స్ ఇయ్యాలంటే అప్పు చేయాల్సిందే..! గత ప్రభుత్వం తీరుతో ఆగమైన సింగరేణి.. 
  • తెలంగాణకు ముందు రూ.3,500 కోట్ల బాండ్లు
  • రాష్ట్ర ఏర్పాటు తర్వాత కరిగిన డిపాజిట్లు.. పెరిగిన అప్పులు
  • దసరా అడ్వాన్స్, లాభాల బోనస్​ కోసం ఇప్పటికిప్పుడు రూ.వెయ్యి కోట్లు కావాలే
  • అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న సింగరేణి ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు: వందేళ్లకు పైగా చరిత్ర కలిగి, ఏటా 70 మిలియన్​టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ.. తన కార్మికుల జీతభత్యాల కోసం నెలనెలా అప్పులు చేయాల్సి వస్తున్నది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు బోనస్, పండుగ అడ్వాన్స్ ఇవ్వడానికి రూ.వెయ్యి కోట్ల రుణం కావాలంటూ సింగరేణి ఆఫీసర్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 

తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.3,500 కోట్ల బాండ్ల(మిగులు నిధుల)తో కళకళలాడిన కంపెనీ 12 ఏండ్లు తిరిగేసరికి వేల కోట్ల అప్పుల్లో మునిగిపోవడానికి గత ప్రభుత్వ నిర్వాకమే కారణమని కార్మికసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జెన్​కో, ట్రాన్స్​కో నుంచి కొండాలా పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం ఇప్పించకపోవడం వల్లే సంస్థకు ఈ గతి పట్టిందని, వెంటనే బకాయిలు చెల్లించకపోతే సమ్మెకు దిగేందుకైనా వెనుకాడమని హెచ్చరిస్తున్నారు.  

తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.3,500 కోట్ల బాండ్లు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యేనాటికి 2014లో సింగరేణి సంస్థకు వివిధ బ్యాంకుల్లో బాండ్ల రూపంలో రూ.3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. అప్పట్లో సింగరేణి తన మిగులు నిధులను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి అధిక వడ్డీ రేట్లు చెల్లించే బ్యాంకుల నుంచి కొటేషన్లు ఆహ్వానించేది. కంపెనీ బిల్లులు, వేతనాలు సకాలంలో క్లియర్​ అయ్యేవి. 2014 నాటికి వివిధ బొగ్గు కొనుగోలుదారుల నుంచి సింగరేణికి కేవలం రూ.4 వేల కోట్లు బకాయిలు ఉండేవి. అవి కూడా కంపెనీ షరతుల మేరకు వడ్డీతో సహా వసూలు అయ్యేవి. 

కానీ పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ట్రాన్స్​కో, జెన్​కో కలిసి రూ.59వేల కోట్ల దాకా సింగరేణికి బకాయి పెట్టాయి. ఇరిగేషన్​ లిఫ్టులు, రైతులకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పెండింగ్​బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆమేరకు జెన్​కో, ట్రాన్స్​కో కూడా సింగరేణికి బకాయిపెట్టాయి. దీనికితోడు గత ప్రభుత్వం సింగరేణి నిధులను దారి మళ్లించడం, నిర్వహణ ఖర్చుల కోసం బాండ్లన్నీ క్రమంగా కరిగిపోవడంతో సంస్థకు కొత్తగా రూ.10 వేల కోట్లకుపైగా అప్పులైనట్లు తెలుస్తోంది.

రూ.వెయ్యి కోట్లకు పైగా కావాలే..

దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) పేరిట కేంద్రం దీపావళి బోనస్​ ప్రకటిస్తుంది. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ.1.05 లక్షల వరకు బోనస్ చెల్లించగా ఈ ఏడాది అర్హులైన ప్రతి కార్మికుడికి రూ.1,10,250. చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు సింగరేణిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు దసరాకు ముందే లాభాల్లో వాటా బోనస్ అందించడం పరిపాటి. ఏటా సింగరేణి సంస్థకు వచ్చే లాభాల్లో నుంచి 33–34 శాతం నిధులను వాటా బోనస్​గా రాష్ట్రప్రభుత్వం కార్మికులకు పంచుతున్నది. 

గతేడాది పర్మినెంట్​ కార్మికులు ఒక్కొక్కరికీ రూ.1.95 లక్షలు చెల్లించగా, కాంట్రాక్ట్​ కార్మికులకు రూ.5,500 చొప్పున మొత్తం రూ.819 కోట్లు వాటా బోనస్​గా అందించారు. 2026 సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ ఇంకా లాభాల వాటా బోనస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముందుగా లాభాలు ప్రకటించి, అందులో నుంచి  35–36 శాతం వాటా ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికితోడు ప్రతి కార్మికుడికి దసరా అడ్వాన్స్ కింద రూ.25 వేలు చెల్లించాలని ఇప్పటికే నిర్ణయించారు. 

ఈ మూడింటిని నెరవేర్చేందుకు సింగరేణి సంస్థకు ఇప్పటికిప్పుడు రూ.వెయ్యి కోట్లకు పైగా అవసరం. పండుగ దగ్గర పడుతుండటంతో కార్మిక సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో బ్యాంకుల నుంచి వీలైతే ఓవర్​ డ్రాఫ్ట్​లేదంటే లోన్లు తెచ్చేందుకు యాజమాన్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది.  

రూ.59 వేల కోట్లు బకాయిలు పెడితే ఎట్లా?

ఈ ఏడాది దసరా, దీపావళి బోనస్ కింద కార్మికులు, ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్లు చెల్లించేందుకు సింగరేణి ఆఫీసర్లు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జెన్ కో, ట్రాన్స్​కో సంస్థలు సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు పెట్టడం వల్లే ఈ సమస్య వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరిపై ఉన్నది.
- కొరిమి రాజ్ కుమార్, సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ), 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి 

బకాయిలు ఇవ్వకుంటే సమ్మెనే..

సింగరేణి కార్మికులు రేయింబవళ్లు కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బొగ్గును కొంటున్న జెన్​ కో సంస్థ రూ.వేల కోట్లు బకాయిలు చెల్లించడం లేదు. సింగరేణి తయారు చేసే కరెంట్ కొంటున్న ట్రాన్స్​కో బకాయిలు సైతం భారీగా పేరుకుపోయాయి. 

దీంతో దసరా పండుగ పూట కార్మికులకు అందించే బోనస్, అడ్వాన్స్​ డబ్బుల కోసం సింగరేణి సంస్థ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తే సింగరేణి సంస్థకు ఈ పరిస్థితి వచ్చేదా? జెన్​కో, ట్రాన్స్​కో వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 13 నుంచి మేం సమ్మె చేస్తాం.
- వి.సీతారామయ్య, సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్