- గురుగ్రామ్‌లో ధ్రువ్ రాఠీ అరెస్ట్
న్యూఢిల్లీ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలను ఢిల్లీ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కేతోపాటు ముఖ్య నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు దీప్కే ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనను పోలీసులు విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఢిల్లీలో విమానం ల్యాండ్ కాగానే.. పోలీసులు అందులోకి ఎంటర్ అయ్యారు. ఈ దృశ్యాలను దీప్కే సోషల్‌మీడియాలో లైవ్‌లో షేర్ చేశారు. ‘‘మేం బయటకు వచ్చేవరకూ ఆగలేరా?.. రండి అరెస్ట్ చేయండి.. మేం ఎవరికీ భయపడబోం” అని పోలీసులకు దీప్కే తేల్చి చెప్పారు.
ఢిల్లీ చేరుకోవడానికి ముందే తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన అభిజీత్ దీప్కే.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజల గొంతును నొక్కేందుకు పోలీసు ఆంక్షలను అడ్డుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రశ్నించే యువతను, పౌరులను చూసి ప్రభుత్వం వణికిపోతోందని విమర్శించారు. కాగా, జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ముందు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీనీ గురుగ్రామ్ సెక్టార్–56లోని ఆయన నివాసంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీప్కే ఇంట విషాదం.. నానమ్మ మృతి
సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇంట విషాదం నెలకొన్నది. ఆయన నానమ్మ మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతోపాటు వయోభార సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె కన్నుమూసిన సమయంలో అభిజీత్ దీప్కే ఢిల్లీలో ఉన్నారు.
మరోవైపు, అభిజీత్ తల్లిదండ్రులు అనితా దీప్కే, భగవాన్ దీప్కే ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్నారు. వారి నివాసం బయట కూడా పోలీసులు మోహరించారు. మరణవార్త తెలుసుకున్న వారు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంతుక్ పింప్రికి బయలుదేరారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్ దీప్కేను ఛత్రపతి శంభాజీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
