సర్పై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి  : రాంచందర్ రావు

సర్పై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి  : రాంచందర్ రావు
  • క్యాడర్​కు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పిలుపు
  •  దమ్ముంటే డిలీట్ అయిన ఓట్లు చూపండి
  • సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి  సవాల్
  • రాష్ట్రపతి ఆధారాలడిగితే పారిపోయారని ఎద్దేవా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్షలాది ఓట్లను అన్యాయంగా తొలగించారంటూ కాంగ్రెస్ అడ్డగోలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి దమ్ముంటే.. ఏకపక్షంగా డిలీట్ అయిన ఒక్క ఓటునైనా చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సవాల్ విసిరారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్  చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేడర్ కు పిలుపునిచ్చారు.

శనివారం హైదరాబాద్‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ కన్వీనర్లు, లీగల్, మీడియా ప్యానలిస్టులు, ముఖ్య నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని స్పష్టం చేశారు. ఈఆర్వో విచారణ జరిపి, అన్ని పార్టీల బీఎల్‌‌ఏలకు నోటీసులు ఇచ్చాకే మార్పులు చేర్పులు జరిగాయని, అలాంటప్పుడు ఏకపక్షంగా ఓట్లను తొలగించే అవకాశమే లేదన్నారు.

దేశవ్యాప్తంగా 95 కోట్ల మంది ఓటర్లలో 82 కోట్ల మంది స్వయంగా ఫారాలు ఇచ్చారని, చనిపోయిన 2.89 కోట్లు, డూప్లికేట్లు 1.01 కోట్లు తేలాయనీ, దీంట్లోనూ ఫారమ్-7 ద్వారా తొలగించినవి కేవలం 29 లక్షల ఓట్లేనని చెప్పారు. 35 లక్షల మంది పార్టీల ఏజెంట్లు భాగస్వాములైన ఈ ప్రక్రియను అవమానించడం సిగ్గుచేటన్నారు. 

రాష్ట్రపతి ముందు రాహుల్ అబద్ధాలు

రాష్ట్రపతిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన రాహుల్ గాంధీ అబద్ధాలతో నాటకమాడారని రాంచందర్ రావు విమర్శించారు. రాష్ట్రపతి రుజువులు అడిగారని స్వయంగా రాహులే చెప్పారని,  చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోయినా.. రాష్ట్రపతిపై తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చరిత్రలో ఓట్ చోరీలకు, రిగ్గింగ్‌‌లకు మూలమే కాంగ్రెస్​ అని రాంచందర్ రావు ఆరోపించారు. ‘1952లో అంబేద్కర్‌‌ను కుట్రతో ఓడించింది..

1957లో బేగూసరాయ్‌‌లో బూత్ క్యాప్చరింగ్‌‌కు తెరతీసింది కాంగ్రెస్సే. 1975లో ఇందిరా గాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టు తీర్పునిస్తే.. కోర్టు అధికారాలు లాక్కొని దేశంపై ఎమర్జెన్సీ రుద్దారు’ అంటూ రామచందర్​రావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం గురించి, పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 

విదేశీ నిధులతో దేశాన్ని బలహీనపరిచే కుట్ర

ఎన్నికల కమిషనర్లను బానిసలుగా మార్చి గవర్నర్లు, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత కాంగ్రెస్‌‌దేనని, మోదీ ప్రభుత్వం ఈసీల నియామకాల్లో సంపూర్ణ పారదర్శకత తీసుకొచ్చిందని రాంచందర్​రావు స్పష్టం చేశారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా మోదీ నాయకత్వంలో భారత్ 7.8% నుంచి 8% జీడీపీ వృద్ధి రేటుతో దూసుకుపోతుంటే.. జార్జ్ సోరోస్ వంటి విదేశీ శక్తుల నిధులతో రాహుల్ గాంధీ దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.