- తొలిరోజు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ
- వెయ్యిస్తంభాల గుడిలో వేడుకలు
- తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు
- చెరువులు, చౌరస్తాలు, ఆలయాల వద్ద చేరి ఆటపాటలు
- ఉయ్యాల పాటలతో మార్మోగుతున్న వాడవాడలు
హైదరాబాద్/వరంగల్, వెలుగు: ‘బతుకమ్మ .. బతుకమ్మ.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాల’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరూరా, వాడవాడలా మహిళలు ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి, గులాబీలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం వేళ మహిళలంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, తాము పేర్చిన బతుకమ్మలను చెరువులు, చౌరస్తాలు, దేవాలయాల వద్ద ప్రతిష్టించి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడారు. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగాయి.
పట్టణాలతోపాటు పల్లెల్లోనూ వేడుకలు కోలాహలంగా సాగాయి. వేడుకల ముగింపులో బతుకమ్మలను స్థానిక చెరువులు, కుంటలలో భక్తిభావంతో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం తరఫున భారీ ఏర్పాట్లు చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. తొలి రోజు వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు, వేములవాడ పట్టణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళ్లలో ఉత్సాహం నింపారు.
హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో మహిళలు ఆడిపాడి సందడి చేశారు. వేలాదిగా తరలొచ్చిన ఆడబిడ్డలతో ఆలయ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకున్నది. వెయ్యిస్తంభాల గుడిలో ఆడబిడ్డలు 36 ఏండ్ల సంబురాలను నిర్వహించుకున్నారు. 1990 నుంచి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా వెయ్యి స్తంభాల గుడి కిక్కిరిసిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇక్కడి నుంచే బతుకమ్మ సంబురాలను ప్రారంభించే అనవాయితీ నడుస్తోంది. ఇక వరంగల్13వ డివిజన్ తోట మైదానంలో మాజీ మంత్రి కొండా సురేఖ మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో వేడుకల్లో పాల్గొన్న జూపల్లి, పొన్నం
బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు వందలాది మంది మహిళలు తరలొచ్చారు. బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతా భావానికి ఈ పండుగ నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు. తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్‌తోపాటు పలువురు కార్పొరేషన్ చైర్‌పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళా తోరణంలోనూ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ సమర్పణలో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలను మంత్రులు ఆవిష్కరించారు.
దక్షిణాఫ్రికాలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న సీతక్క
దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అక్కడ ఉంటున్న తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి, పాడారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో వేడుకల్లో సందడి చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, ఉత్సాహం మధ్య సాగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోనూ నిర్వహించడం పట్ల సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి పాల్గొన్నారు.
