- ధరలు పెరిగినా తగ్గని అమ్మకాలు
- ప్రీమియం ఎలక్ట్రానిక్ ప్రొడక్టులకూ గిరాకీ
- పండుగ ఆఫర్లతో మరింత జోరు
న్యూఢిల్లీ: ఈఎంఐ స్కీములతో, ఆకర్షణీయ ఆఫర్లతో దసరా, దీపావళి పండుగల విక్రయాలు పరుగులు తీస్తున్నాయి. ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీల వంటి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రికార్డు స్థాయి అమ్మకాలు సాధిస్తున్నాయి.
ఓనమ్, వినాయక చవితి పండుగల సందర్భంగా నమోదైన బలమైన అమ్మకాలు పరిశ్రమ వర్గాల్లో జోష్ నింపాయి. ఇటీవల కంపెనీలు ధరలు పెంచినప్పటికీ, అమ్మకాలు మాత్రం తగ్గలేదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..ఎక్కువ ధర ఉండే ప్రీమియం కేటగిరీ ఎలక్ట్రానిక్స్ సేల్స్ దూసుకెళ్తున్నాయి.
ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగుతుందని తయారీదారులు నమ్ముతున్నారు. మార్కెట్లో కొనుగోలుదారుల సెంటిమెంట్ ఎంతో సానుకూలంగా ఉందని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా సీఈవో సతీష్ వివరించారు. ధరల పెంపునకు వినియోగదారులు మానసికంగా సిద్ధపడటంతో పాటు ఫైనాన్సింగ్ పథకాలు, ప్రత్యేక పండుగ ఆఫర్లు ధరల ప్రభావాన్ని తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.
ఖరీదైన వస్తువులకూ ఓకే..
కన్జూమర్ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ కూడా ప్రీమియం ప్రొడక్టుల విక్రయాలపై ధీమాగా ఉంది. అశుభకాలంగా భావించే శ్రాద్ధపక్షాల సమయంలోనూ ఎంక్వైరీలు పెరగడం తమకు నమ్మకాన్ని ఇచ్చిందని సంస్థ డైరెక్టర్ సంజయ్ చిట్కారా తెలిపారు. పండుగలు కొత్త ప్రొడక్టుల కొనుగోళ్లకు, పాత వస్తువులను మార్చుకోవడానికి ప్రధాన వేదికగా మారాయి.
ప్రస్తుతం పెద్ద స్క్రీన్ టీవీలు, నాలుగు డోర్ల రిఫ్రిజిరేటర్లు, పెద్ద వాషింగ్ మెషీన్లకు, ఏసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. డిష్వాషర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఆడియో పరికరాలు, వాటర్ ప్యూరిఫయర్ల వంటి విభాగాల్లోనూ వ్యాపారం పుంజుకుంది. హాయర్లో మీడియం, ప్రీమియం ఉత్పత్తులు ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో 30 నుంచి 35 శాతం మేర వృద్ధిని సాధించగా, సాధారణ స్థాయి ఉత్పత్తుల అమ్మకాలు 15 శాతానికే పరిమితమయ్యాయి.
ధరలు పెరిగాయ్ కానీ..
ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో కంపెనీలు ధరలను 7 శాతం దాకా పెంచాయి. ఉత్పత్తి ఖర్చు10 శాతం దాకా పెరిగినప్పటికీ ఇవి ఆ భారాన్ని ఒకేసారి వినియోగదారులపై మోపడం లేదు. హాయర్ఉత్పత్తి ఖర్చు పెరుగుదలలో 50 శాతాన్ని మాత్రమే బదిలీ చేసి మిగిలిన భారాన్ని తనే భరిస్తోంది. రిటైల్ వ్యాపారుల వద్ద పాత నిల్వలు ఉండటం వల్ల కొనుగోలుదారులపై పూర్తి భారం పడటం లేదు.
పాత నిల్వలు అయిపోయి, కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమలైనప్పుడు డిమాండ్ ఎలా ఉంటుందనేదే కంపెనీలకు అసలైన పరీక్ష. లాభదాయకతపై భిన్న అంచనాలు ఉన్నప్పటికీ, ప్రీమియం వస్తువుల అమ్మకాల జోరుతో సంస్థల ఆదాయం బలపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రికార్డుల మోత
తాము ఇటీవల ప్రారంభించిన గ్రేట్ఇండియా ఫెస్టివల్ సేల్కు భారీ ఆదరణ వస్తోందని అమెజాన్ ప్రకటించింది. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని సంస్థ తెలిపింది. మొదటి రోజే అమ్మకాల పరిమాణం గతేడాదితో పోలిస్తే 100 శాతం వృద్ధి సాధించింది. దేశంలోని ప్రతి పిన్ కోడ్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తినట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు.
కొనుగోలుదారుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకోగా, ప్రతి ముగ్గురిలో ఒకరు క్యాష్‌బ్యాక్ పొందారు. ప్రైమ్ సభ్యులు మొదటి 12 గంటల్లోనే భారీగా ఆదా చేసుకున్నారు. అమెజాన్ నౌ సేవలు ఉన్న 120 నగరాల్లో ఆర్డర్లను నిమిషాల్లోనే డెలివరీ చేశారు. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాలు 70 శాతం పెరిగాయి. 55 అంగుళాలు, ఆపై సైజు గల స్మార్ట్ టీవీలు మొత్తం విక్రయాల్లో 65 శాతం వాటాను దక్కించుకున్నాయి.
సులభ వాయిదాలకు కస్టమర్లు సై..
గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ఓనమ్ సమయంలో అమ్మకాల్లో రెట్టింపు వృద్ధి సాధించింది. మొత్తం అమ్మకాల్లో సులభ వాయిదాల వాటా 45 నుంచి 47 శాతంగా ఉంది. ఇది త్వరలోనే 50 శాతం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఈఎంఐ సదుపాయాలు ఖరీదైన కొనుగోళ్లను సులభతరం చేసిందని, తమ సంస్థ అన్ని రకాల ప్రొడక్టులకు ఐదేళ్ల వారంటీని ఇస్తోందని గోద్రెజ్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు.
మహారాష్ట్ర సహా ఇతర మార్కెట్లలో వినాయక చవితి సందర్భంగా ఈ కంపెనీ ఉత్పత్తులకు భారీ గిరాకీ వచ్చింది. ఈసారి సేల్స్ 40 శాతానికి పైగా పెరుగుతాయని కమల్ పేర్కొన్నారు. గత ఏడాది జీఎస్టీ తగ్గింపు వల్ల ఏర్పడిన బేస్ ఎఫెక్ట్ కూడా ఇందుకు కలిసొచ్చింది. ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిజ్‌లు, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు, ఏసీలు అధికంగా అమ్ముడవుతున్నాయి.
