- ఆదిలాబాద్ రిమ్స్‌లో గత నెల 21న అగ్ని ప్రమాదం
- ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే షార్ట్ సర్క్యూట్
- ఎస్‌ఎన్‌సీయూలో ఘటనకు కారణం చెప్పిన కమిటీ
- యాభై పేజీల నివేదిక అందించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు శిశువులు మృతి చెందిన విషాద ఘటనకు ఎలుకలే కారణమని తేలింది. ఏసీ వైర్లను ఎలుకలు కొరకడంవల్లే షార్ట్ సర్క్యూట్ జరిగి.. అగ్ని ప్రమాదం సంభవించిందని విచారణ కమిటీ తేల్చింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంపై విచారణ కోసం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ నివేదికను కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వానికి అందజేశారు.
ప్రమాదానికి ఎలుకలే కారణమని 50 పేజీలతో కూడిన నివేదికలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏసీ పేలి ప్రమాదం జరిగిన స మయంలో వార్డులో 27 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. దట్టమైన పొగలతో ఊపిరాడక ఐదుగురు పసికందులు కన్నుమూశారు. మిగతా చిన్నారులను కార్పొరేట్ హాస్పిటల్స్‌కు తరలించి చి కిత్స అందించారు. కాగా సిబ్బంది నిర్లక్ష్యం, వార్డులో పలు లోపాలను సైతం విచారణ కమిటీ గుర్తించినట్టు సమాచారం.
కానీ నివేదికలోనిఈ విషయాలన్నింటినీ అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన తీరుతోపాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నివేదించినట్టు తెలిసింది. ఇం తటి ఘోర ప్రమాదంపై అధికారుల నిర్లక్ష్యం సైతం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నివేదికను పరిశీలించిన అనంతరం సంబంధింత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్లపై వేటు పడే అవకాశం లేకపోలేదని హాస్పిటల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎలుకలను గుర్తించలేదా?
ఈ విషాద ఘటనకు ఎలుకలు ఏసీ వైర్లను కొరకడమే కారణమని విచారణ కమిటీ నివేదికలో పొందుపర్చినట్టు లీక్ కావడంతో అసలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన ఎస్‌ఎన్‌సీయూలోకి అవి ఎట్లొచ్చాయనే చర్చ మొదలైంది. ‘‘నవజాత శిశువులకు వైద్యం అందించే వార్డులో ఎలుకలు తిరుగుతున్నా అధికారులు గుర్తించలేదా? ఎంతో అలర్ట్‌గా మానిటరింగ్ చేయాల్సిన వార్డును గాలికొదిలేశారా?’’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎస్‌ఎన్‌సీయూ వార్డులోకి ఎలుకలు రావడమంటే మెయింటెనెన్స్ లోపం, అధికారుల నిర్లక్షమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పసిపిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
