దేశవ్యాప్తంగా  లక్ష ప్రభుత్వ బడులు మూత : మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం 

దేశవ్యాప్తంగా  లక్ష ప్రభుత్వ బడులు మూత : మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం 
  • ప్రారంభమైన ఎస్టీఎఫ్ఐ శిక్షణా తరగతులు

హైదరాబాద్, వెలుగు: ‘గడిచిన పన్నెండేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్ష ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. గిరిజన, ఆదివాసీ ఆవాసాల్లో సర్కారు బడులు ఆనవాళ్లు లేకుండా కనుమరుగవుతున్నాయి. పేద పిల్లలు చదువుకునే బడులను గాలికొదిలేసిన పాలకులు.. ఆర్భాటంగా పెద్ద పెద్ద విగ్రహాల నిర్మాణాలకే ప్రాధాన్యమిస్తున్నారు’ అని ఏపీ మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని టీఎస్‌‌‌‌‌‌‌‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ప్రారంభమైన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) దక్షిణాది రాష్ట్రాల మూడు రోజుల ఉద్యమ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

దేశంలో 1 నుంచి 10వ తరగతి వరకు పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ పై పేరెంట్స్ దాదాపు రూ.16 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. మెడిసిన్ సీట్ల కోసం నీట్ కోచింగ్‌‌‌‌‌‌‌‌లకు పెడుతున్న ఖర్చు ఏకంగా కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయించే మొత్తం బడ్జెట్ కంటే అధికంగా ఉందన్నారు. ప్రైమరీ స్కూళ్లలో ఐదు తరగతులకు ఒకరో ఇద్దరో టీచర్లు మాత్రమే ఉండడం, తాగునీరు, మూత్రశాలల వంటి కనీస వసతులు లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ సంక్షోభంలో ప్రజాస్వామ్యం - మేధావుల పాత్ర, భారత ఆర్థిక వ్యవస్థ - మధ్యతరగతిపై ప్రభావం అంశాలపై తరగతులు బోధించారు.