పల్లెలకు ఉపాధి భరోసా : ప్రతి పంచాయతీలో రోజూ 60 మందికి పని కల్పించాల్సిందే..!

పల్లెలకు ఉపాధి భరోసా : ప్రతి పంచాయతీలో రోజూ 60 మందికి పని కల్పించాల్సిందే..!
  • పొద్దుగాళ్ల 6 గంటలకే ఆఫీసర్లు ఫీల్డులో ఉండాలి 
  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఏపీవోలు, ఈసీలకు ఆఫీసర్ల హుకుం
  • కూలీల సమీకరణలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కీలక బాధ్యతలు 

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భరోసానిచ్చే ఉపాధి స్కీమ్ (వీబీ– జీ– రామ్​జీ)ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్​పలు చర్యలు తీసుకుంటున్నది. గ్రౌండ్ లెవల్​లో లేబర్ రిపోర్టును మెరుగుపర్చడంలో భాగంగా ప్రతి పల్లెలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. 

ఈ మేరకు ఏపీవోలు (అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు), ఈసీలు (ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు) క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీవోలు, ఈసీలు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పనులు సమయానికి ప్రారంభమయ్యేలా చూడటం, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సర్కార్​ హుకుం జారీ చేసింది. పని ప్రదేశంలో కూలీలు ఇబ్బంది పడకుండా, వారు రాకముందే పనుల కొలతలకు అనుగుణంగా మార్కింగ్, హద్దులను నిర్ధారించాలని స్పష్టంచేసింది.

సర్పంచులు, కార్యదర్శులకు భాగస్వామ్యం

కూలీల సమీకరణలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యదర్శులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనులకు డిమాండ్ పెంచాలి. ప్రతి గ్రామ పంచాయతీలో అవసరమైన పనులను గుర్తించి, నిరంతరాయంగా ఉపాధి కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ప్రతి కూలీ రోజుకు రూ.307 ఆదాయం పొందేలా చూడాలని ఆఫీసర్లను ప్రభుత్వంఆదేశించింది. 

ఇందుకోసం పనుల నిర్వహణ, కొలతలు, పని విభజన సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలని సూచించింది. పనుల పర్యవేక్షణను పటిష్టం చేసేందుకు ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌‌‌‌‌‌‌‌ను నియమిస్తున్నారు. వచ్చే వారం నుంచి లేబర్ రిపోర్టులో పురోగతి కనిపించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి గ్రామ పంచాయతీలో రోజువారీ కూలీల హాజరును ఉన్నతాధికారులు నిరంతరం ట్రాక్​ చేయనున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.