రేడియల్ రోడ్డు – 2 టెండర్లలో రూ.3,296 కోట్ల గోల్‌‌మాల్!..సీఎం రేవంత్‌‌ కు కేటీఆర్ బహిరంగ లేఖ 

రేడియల్ రోడ్డు – 2 టెండర్లలో రూ.3,296 కోట్ల గోల్‌‌మాల్!..సీఎం రేవంత్‌‌ కు కేటీఆర్ బహిరంగ లేఖ 
  •  నచ్చినోళ్లకే కాంట్రాక్టులు ఇచ్చిన్రు
  • హెచ్‌‌ఎండీఏ, హెచ్‌‌జీసీఎల్‌‌ కాంట్రాక్టులపై ‘కాగ్’తో స్పెషల్ ఆడిట్ చేయించాలని డిమాండ్‌‌ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘రేడియల్‌‌ రోడ్‌‌-–2’ ప్రాజెక్టు టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ఆరోపించారు. బుద్వేల్‌‌ ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డు నుంచి కొడంగల్‌‌ సమీపంలోని ఎన్‌‌హెచ్‌‌-–167ఎన్‌‌ వరకు 81.15 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన గ్రీన్‌‌ఫీల్డ్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ వే టెండర్లలో పారదర్శకతకు పూర్తిగా పాతరేశారని మండిపడ్డారు. పనులను 3 ప్యాకేజీలుగా విభజించి, ముందస్తు ఒప్పందం ప్రకారమే నచ్చిన సంస్థలకు కట్టబెట్టారన్నారు.

తక్కువ ధరకు బిడ్లు వేసిన అర్హులైన సంస్థలను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి, ఎక్కువ ధర కోట్ చేసిన సంస్థలకు పనులు కేటాయించడం ద్వారా వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌‌ శనివారం బహిరంగ లేఖ రాశారు. రూ.3,296 కోట్ల భారీ ప్రాజెక్టు టెండర్ల మూల్యాంకనాన్ని ప్రభుత్వం ఆగమేఘాల మీద ముగించడం వెనుక పెద్ద మతలబు ఉందని పేర్కొన్నారు.

“ఈ ప్రాజెక్టును 3 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా, బిడ్ల దాఖలుకు గడువు సెప్టెంబర్‌‌ 30తో ముగిసింది. అక్టోబర్‌‌ 8 నాటికే టెక్నికల్ ఎవాల్యుయేషన్, బిడ్డర్ల అర్హతల పరిశీలన, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలనతోపాటు కేటాయింపుల ప్రక్రియ కూడా పూర్తయినట్లు రికార్డులు చెబుతున్నాయి. మధ్యలో వచ్చిన సెలవులను మినహాయిస్తే కేవలం 5 పని దినాల్లోనే 13 బిడ్లను అధికారులు ఎలా పరిశీలించారు? సంస్థలు సమర్పించిన పత్రాలను అసలు పరిశీలించారా? అధికారుల నిర్ణయాలకు సరైన ఆధారాలు రికార్డుల్లో నమోదు చేశారా? అంత తక్కువ సమయంలో వేల కోట్ల ప్రాజెక్టు పనులను తేల్చేశారంటే ఇది పక్కా ప్రీ -ఫిక్సింగ్ కాదా?” అని ప్రశ్నించారు.

 కేటీఆర్‌‌‌‌ లేఖలో ఏం ప్రస్తావించారంటే..

   ప్యాకేజీ–1లో ‘జీకేసీ’ సంస్థను అనర్హులుగా ప్రకటించిన అధికారులు.. ప్యాకేజీ–3లో మాత్రం అదే సంస్థకు ఏ ప్రాతిపదికన అర్హత కల్పించారని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘బీవీఎస్‌‌ఆర్‌‌’ కంపెనీకి ప్యాకేజీ–1, ప్యాకేజీ–2లలో అర్హత ఇచ్చి, ప్యాకేజీ–3లో ఏ కారణంతో తిరస్కరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అడిగారు.

   ‘‘ప్యాకేజీ-1ను ఎన్‌‌సీసీ లిమిటెడ్‌‌కు అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా రూ.1,286.03 కోట్లకు కేటాయించినట్టు రికార్డులు చెబుతున్నాయి.  ప్యాకేజీ–2ను బీవీఎస్‌‌ఆర్‌‌కు, ప్యాకేజీ–3ని జీకేసీకి కేటాయించినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వాటి పూర్తి ఆర్థిక వివరాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంది?’’ అని కేటీఆర్‌‌‌‌ ప్రశ్నించారు. 

   ప్యాకేజీ-3లో దాదాపు రూ.1,034 కోట్ల విలువైన పనులకు కేవలం ఇద్దరు బిడ్డర్లను మాత్రమే అర్హులుగా తేల్చడం మ్యాచ్ ఫిక్సింగ్‌‌కు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. అత్యంత తక్కువ ధరకు (ఎల్‌‌1) బిడ్లు దాఖలు చేసిన ‘సుషీ ఇన్‌‌ఫ్రా అండ్‌‌ మైనింగ్‌‌ లిమిటెడ్‌‌’ను మూడు ప్యాకేజీల్లోనూ ఉద్దేశపూర్వకంగా తప్పించారని ఆరోపించారు.    హెచ్‌‌ఎండీఏ, హెచ్‌‌జీసీఎల్‌‌ చేపడుతున్న భారీ టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇదే తరహాలో సుమారు రూ.591 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘రేడియల్‌‌ రోడ్‌‌-1’ పనులను సైతం ఎస్టిమేట్ కంటే ఏకంగా 15 శాతం అధిక ధరకు కేటాయించారని ఆరోపించారు. ఈ రెండు రేడియల్ రోడ్ల వ్యవహారంలోనూ క్విడ్ ప్రో కో జరిగిందని, కాగ్‌‌తో ప్రత్యేకంగా ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు.