- క్యూర్ పరిధిలో హైఅలర్ట్ ప్రకటించండి
- వర్షాలతో జనాలకు ఇబ్బందుల్లేకుండా చూడండి
- పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్, హైడ్రా సమన్వయంతో పనిచేయాలి
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలతో ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్‌తో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ నిరంతరం క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
పరిస్థితిని పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్‌లతో పాటు సీనియర్ అధికారులందరితో కలిసి అత్యవసరంగా సమీక్షించి, తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ అందించే రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగానే సహాయక బృందాలను మొహరించాలన్నారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
