ఏదుల నుంచే డిండికి నీళ్లు ...గొడవలొద్దు.. పనులు స్పీడప్ చేయండి: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

ఏదుల నుంచే డిండికి నీళ్లు ...గొడవలొద్దు.. పనులు స్పీడప్ చేయండి: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  • డిండి జ్యురిస్డిక్షన్ వివాదంపై ముఖ్యమంత్రి
  • పీఆర్ఆర్ డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో ఏదుల సోర్స్ అని స్పష్టం
  • కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై దృష్టి పెట్టండి
  • డీపీఆర్ అప్రైజల్ వేగంగా పూర్తిచేయాలని సూచన
  • కాళేశ్వరం బ్యారేజీలకు డయాఫ్రం వాల్ 
  • పనులు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌పై మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి రివ్యూ


హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరిలో వీలైనంత ఎక్కువ నీటి వాడకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాకు నీళ్లు అందించే డిండి ప్రాజెక్టు, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై అధికారులకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆ శాఖ అధికారులతో ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. డిండి ప్రాజెక్టు జ్యురిస్డిక్షన్‌‌‌‌ వివాదంపై కీలకమైన చర్చ జరిగినట్టు తెలిసింది. ఉమ్మడి నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని 3.4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు తాగు నీటి కోసం 30 టీఎంసీలు తరలించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయనిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల ద్వారా నీటిని తరలించేలా ప్లాన్ చేశారు. నీటి సోర్స్‌‌‌‌ను పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నారు. అయితే, ప్రాజెక్ట్ జ్యురిస్డిక్షన్‌‌‌‌ విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొన్నది. 


నల్గొండ సీఈకి బాధ్యతలు అప్పగించగా.. దీనిపై నాగర్‌‌‌‌కర్నూల్‌‌ సర్కిల్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిసింది. ఆ గొడవపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలిసింది. గొడవలు పక్కనపెట్టి ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. ప్రాజెక్టు భూసేకరణపైనా ఆయన చర్చించారని  తెలిసింది. పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండో రిజర్వాయర్ ఏదుల నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. పాలమూరు-–రంగారెడ్డి డీపీఆర్‌‌‌‌ను దాఖలు చేసినప్పుడే.. అందులోనే ఏదుల నుంచి డిండికి నీటిని తరలించాలని పేర్కొన్నట్టు సీఎం గుర్తు చేశారని సమాచారం. డిండి ఎత్తిపోతల పథకంలో కెనాల్, ఇతర కాంపోనెంట్లు కొలిక్కి వచ్చినప్పటికీ హెడ్ రెగ్యులేటరీ విషయంలో సందిగ్ధత ఉందని అధికారులు చెప్పగా.. ఏదుల నుంచే డిండికి నీటిని తరలించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. 

కాళేశ్వరం బ్యారేజీల పనుల్లో వేగం పెంచాలి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లను నిర్ణీత వ్యవధిలోగా చేపట్టాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది.  3 బ్యారేజీలను మళ్లీ వినియోగంలోకి తేవాలంటే విధిగా బ్యారేజీల ఎగువన(అప్‌‌స్ట్రీమ్‌‌), దిగువన (డౌన్ స్ట్రీమ్)లో డయాఫ్రం వాల్ కట్టాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారని, బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు తుదిరూపు ఇచ్చి.. సీడబ్ల్యూసీలోని ఓవర్ సైట్ కమిటీ మదింపు అనంతరం మరమ్మతులను ప్రారంభించాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో డయాఫ్రం వాల్స్‌‌ కట్టాలని, స్టిల్లింగ్ బేసిన్‌‌ను కూడా పెంచాలని, మరమ్మతుల అనంతరం బ్యారేజీల్లో మళ్లీ సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు.

ఇక తుమ్మిడిహెట్టి పీఎఫ్​ఆర్‌‌‌‌పై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ వినియోగం, పనుల పురోగతిపైనా చర్చించినట్టు సమాచారం. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌‌‌‌కు నీటిని తరలించే కెనాల్ నెట్‌‌వర్క్‌‌ పనులను వీలైనత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది. అయితే, ఇప్పటికే సీడబ్ల్యూసీ థర్డ్ టీఎంసీకి సంబంధించిన ఖర్చులు, ఆయకట్టు పరిధిపై అభ్యంతరం తెలుపుతూ డీపీఆర్‌‌‌‌ను వెనక్కు పంపిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. డీపీఆర్ అప్రైజల్‌‌కు సంబంధించిన పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలని సీఎం సూచించినట్టు తెలిసింది. థర్డ్ టీఎంసీ భూసేకరణపైనా సీఎం ఆరా తీశారని సమాచారం.